న్యాయపోరాటానికి సిద్దం అవుతున్న మల్‌రెడ్డి రంగారెడ్డి

December 14, 2018


img

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి 300 ఓట్లు లోపు తేడాతో ఓడిపోయిన మల్‌రెడ్డి రంగారెడ్డి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజత్ కుమార్ ను కలిసి రీకౌంటింగ్ చేయించాలని అభ్యర్ధించారు. 17 రౌండ్ల వరకు ఆధిఖ్యతలో కొనసాగిన తనకు 18వ రౌండు నుంచి మెజార్టీ తగ్గడంపై అనుమానాలున్నాయని ఫిర్యాదు చేశారు. 

తెరాస అభ్యర్ధి కుమారుడి ఒత్తిడి మేరకే కౌంటింగ్ అధికారి ఉద్దేశ్యపూర్వకంగా తన ఆదిఖ్యతను క్రమంగా తగ్గించినట్లు మల్‌రెడ్డి రంగారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. 18వ రౌండు ఓట్లు లెక్కిస్తున్నప్పుడు తెరాస అభ్యర్ధి కుమారుడు నిబందనలకు విరుద్దంగా సెల్ ఫోన్ తో కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించాడని, ఆ ఫోన్ ద్వారా కేటిఆర్‌ నుంచి ఆదేశాలు రావడంతో అంతవరకు వెనుకబడిపోయిన తెరాస అభ్యర్ధి హటాత్తుగా ఆధిఖ్యతలోకి వచ్చేరని మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. కనుక ఈవీఎంలలో ఓట్లను, వివి ఫ్యాట్ రసీదులను మళ్ళీ రీకౌంటింగ్ చేయించాలని కోరారు. రీకౌంటింగ్ జరిపించేవరకు తెరాస అభ్యర్ధి ప్రమాణస్వీకారాన్ని నిలిపివేయాలని కోరారు. ఎన్నికల సంఘం స్పందించకపోతే కౌంటింగులో అన్యాయం జరిగిన ఇతర అభ్యర్ధులతో కలిసి న్యాయపోరాటం చేస్తానని మల్‌రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికలలో 500-1,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయినవారు ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మల్‌రెడ్డి రంగారెడ్డి అభ్యర్ధనపై ఎన్నికల సంఘం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. 


Related Post