హుందాగా స్పందించిన మల్లు

December 14, 2018


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఆ పార్టీ నేతలు ఒకరొకరుగా స్పందిస్తున్నారు. ఈ ఎన్నికలలో మధిర నుంచి ఘనవిజయం సాధించిన సీనియర్ కాంగ్రెస్‌ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఓటమిపై చాలా హుందాగా స్పందించారు.

గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఆరాటపడలేదు. ఈ ఎన్నికలలో మాపార్టీ ఓడిపోవడం బాధాకరమే కానీ ప్రజాతీర్పును గౌరవిస్తున్నాము. ఎన్నికలలో ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీ పనైపోయిందంటూ కొందరు తెరాస నేతలు అహంభావంతో మాట్లాడుతున్నారు. ఎన్నికలలో గెలిచామనే అహంభావంతో విర్రవీగుతూ ప్రతిపక్ష పార్టీలను నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. అధికారం ఎప్పుడూ ఎవరికీ శాశ్వితం కాదని గ్రహిస్తే మంచిది. 1994లో కూడా మాకు ఇటువంటి అనుభవమే ఎదురైంది. అప్పుడు కేవలం 24 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాము. కానీ ఆ తరువాత మళ్ళీ అధికారంలోకి వచ్చాము. కనుక రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజం.

ఈ ఎన్నికలలో మేము ఓడిపోయినప్పటికీ, భాద్యత కలిగిన ప్రతిపక్షపార్టీగా ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో నిరంతరం పోరాడుతూనే ఉంటాము. తెరాస ఎన్నికల హామీలను అమలుచేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉంటాము. మా ఓటమికి గల కారణాలను తెలుసుకొని వాటిని సదిదిద్దుకొని త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతాము. ఆ తరువాత లోక్ సభ ఎన్నికలను ఇదే స్పూర్తితో ఎదుర్కొని సత్ఫలితాలు రాబడతాము,” అని అన్నారు. 

పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక ప్రజాకూటమిగానే ముందుకు సాగుతుందా అనే విషయంపై పార్టీలో చర్చించుకొన్నాక నిర్ణయించుకొంటామని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.


Related Post