జగన్‌ బూరెల గంపలో పడ్డారా?

December 13, 2018


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్‌-చంద్రబాబు నాయుడు మద్య జరిగిన రాజకీయ యుద్దం పుణ్యమాని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అడగకుండానే తెరాస, మజ్లీస్ పార్టీల నుంచి ఆయాచితంగా మద్దతు, వాటి సహకారం లభించబోతోంది. కనుక ఆయన పని బూరెల గంపలో పడినట్లు కాబోతోంది. 

 ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికలలో ప్రజాకూటమి తరపున ప్రచారం చేశారు కనుక తెరాస కూడా వచ్చే ఏడాది జరుగబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తప్పకుండా జోక్యం చేసుకొంటుందని కేసీఆర్‌ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాము కూడా కేసీఆర్‌ బాటలోనే నడిచేందుకు సిద్దమని సూచిస్తూ, త్వరలో జరుగబోయే లోక్ సభ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తామని,  వైకాపా తరపున ఏపీలో ఎన్నికల ప్రచారం చేయడానికి వస్తానని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. జగన్‌ తనకు మంచి స్నేహితుడని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలంగాణలో కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసినా చంద్రబాబు సక్సస్  కాలేకపోయారని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఏపీలో టిడిపి కనీసం రెండు సీట్లు గెలుచుకోలేదని అసదుద్దీన్ ఓవైసీ జోస్యం చెప్పారు.


Related Post