లగడపాటి చిలక ఎగిరిపోయిందా?

December 12, 2018


img

మంగళవారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కేసీఆర్‌ చెప్పినట్లుగానే మొదటినుంచే తెరాస ప్రభంజనం కనిపించింది. తెరాస మొత్తం 119 స్థానాలకు పోటీ చేయగా 88 గెలుచుకొంది. వివిద మీడియా సంస్థలు పోలింగ్ ముగియగానే ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో “ఇండియా టుడే” ప్రకటించిన ఫలితాలు మాత్రమే దాదాపు నిజం అయ్యాయి. ఆ సంస్థ తెరాసకు 79-81, ప్రజాకూటమికి 21-33, బిజెపికి 1-3, ఇతరులకు 4-7 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించగా ఇంచుమించు ఆ విధంగానే ఫలితాలు వచ్చాయి.

లగడపాటి చిలక జోస్యంతో మరోసారి నవ్వులపాలయ్యారు. ప్రజాకూటమి కనీసం 30 సీట్లైనా గెలుచుకోలేకపోయింది. ఫలితాలు వెలువడే ముందు అంటే సోమవారం మరోసారి జోస్యం చెపుతానని అన్నారు. కానీ మీడియా ముందుకు రాలేదు. బహుశః ఆయన చిలక ఎగిరిపోయినందునే రాలేకపోయారని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.   మొత్తంగా చెప్పాలంటే ఎన్నికల ఫలితాలపై విశ్లేషకుల అంచనాలన్నీ తప్పాయి. 

కాంగ్రెస్ పార్టీ కేవలం 19, టిడిపి-2 సీట్లు కలిపి మొత్తం 21 సీట్లు గెలుచుకోగలిగాయి. తెలంగాణ జనసమితి ఊహించినట్లుగానే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. తెరాస ప్రభంజనం కారణంగా హుస్నాబాద్ నుంచి పోటీ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కూడా ఓడిపోయారు. ఇక మజ్లీస్ పార్టీ పోటీ చేసిన 7 స్థానాలోను విజయం సాధించింది. 

రాష్ట్రంలో తెరాసకు తాము మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయమని, ప్రభుత్వ ఏర్పాటులో తెరాసకు షరతులతో కూడిన మద్దతు ఇస్తామని గొప్పలు చెప్పుకొన్న బిజెపి ఈసారి ఒకే ఒక సీటు (గోషామహల్) గెలుచుకొంది. అది కూడా గెలుచుకోకపోయుంటే మరో ఐదేళ్ళవరకు బిజెపి రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యమే ఉండేది కాదు. 

ఇంత తెరాస ప్రభంజనంలో కూడా ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించడం విశేషం. అనేక నియోజకవర్గాలలో బిజెపి కంటే స్వతంత్ర అభ్యర్ధులకే ఎక్కువ ఓట్లు పడటం విశేషం. స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసిన కోరుకంటి చందర్‌ పటేల్‌(రామగుండం), రాములు నాయక్ (వైరా) గెలిచారు. వారిలో  కె. చందర్ పటేల్ తెరాస, రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలలో టికెట్ ఆశించి లభించకపోవడంతో తిరుగుబాటు అభ్యర్ధులుగా పోటీ చేశారు. కనుక చందర్ పటేల్ మళ్ళీ తెరాసలో చేరిపోవడం ఖాయమనే భావించవచ్చు. రానున్న రోజులలో రాములు నాయక్ తో సహా మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మేల్యేలు తెరాసలో చేరిపోయినా ఆశ్చర్యం లేదు.  


Related Post