డిల్లీకి ఉత్తమ్...అందుకేనా?

December 10, 2018


img

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో సోమవారం డిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నందున భవిష్య కార్యాచరణగురించి ఆయనతో చర్చించేందుకు డిల్లీకి పిలిపించి ఉండవచ్చు. 

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్‌ పార్టీ మొదట దెబ్బ తిన్నప్పటికీ, ఆ తరువాత చాలా చురుకుగా వ్యవహరించి అధికారం దక్కించుకోగలిగింది. ప్రస్తుతం తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి కనుక ఒకవేళ తెరాస, ప్రజాకూటమి దేనికీ పూర్తిమెజార్టీ రానట్లయితే, రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా వ్యవహరించాలనే దానిపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మార్గదర్శనం చేయవచ్చు. 

ఒకవేళ ప్రజాకూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మెజార్టీ లభించినట్లయితే, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ మొదలవుతుంది. కనుక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పరిస్థితులను బట్టి కాంగ్రెస్‌ అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించవచ్చునని, అందుకే ఆయనను డిల్లీకి పిలిపించి ఉండవచ్చునని కాంగ్రెస్‌ పార్టీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఒకవేళ తెరాస లేదా ప్రజాకూటమికి పూర్తి మెజార్టీ వస్తే రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం సుస్థిర రాజకీయ పరిస్థితులు నెలకొంటాయి. ఒకవేళ హంగ్ ఏర్పడినట్లయితే తెరాస, ప్రజాకూటమి రెండూ ఒకపక్క ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేల మద్దతు పొందడానికి గట్టి ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క తమ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా కాపాడుకోవలసి ఉంటుంది. లేకుంటే ఈనగాసి నక్కల పాలు చేసినట్లవుతుంది.


Related Post