ఓటమి భయంతోనే అలా మాట్లాడుతున్నారా.. లేక

December 09, 2018


img

ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన దాసోజు శ్రవణ్ శనివారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ, ఈవిఎమ్ లను ట్యాంపరింగ్ చేయించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిలో ముందుగానే అమర్చిన  బ్లూటూత్ వంటి పరికరాలకు శాటిలైట్ ఫోన్ల ద్వారా సిగ్నల్స్ పంపించి, వాటిలో నిక్షిప్తమై ఉన్న ఓట్లను తెరాసకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నించవచ్చునని కనుక ఈవిఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మొబైల్ సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన పార్టీ అభ్యర్ధులకు, కార్యకర్తలకు ఈవిఎం భద్రతపై నిఘా ఉంచాలని కోరారు. కాంగ్రెస్‌ నేతల ఈ ఆరోపణలపై రజత్‌కుమార్‌ స్పందిస్తూ, కావాలనుకొంటే అన్ని పార్టీలు తమ తమ ప్రతినిధులతో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద నిఘా పెట్టుకోవచ్చునని చెప్పారు.   

సాధారణంగా ఓడిపోబోతున్నామని గ్రహించిన పార్టీలే ఇటువంటి మాటలు మాట్లాడుతుంటాయి. కనుక ప్రజాకూటమి 75-80 సీట్లు గెలుస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొంటున్నప్పటికీ, మనసులో ఓటమి భయం ఉన్నట్లే భావించవచ్చు. అయితే వేరే దేశాలలో ఎక్కడో ఉన్న సంస్థలు మనదేశ రక్షణ, ఇతర ప్రభుత్వ శాఖల హ్యాక్ చేసి డాటాను చోరీ చేసి వాటి స్థానంలో తమ హెచ్చరికలను పోస్ట్ చేయగలుగుతున్నప్పుడు, ఇంటర్నెట్ తో అనుసంధానమై ఉండే ఎలక్ట్రానిక్ పరికరమైన ఈవిఎంలను హ్యాకింగ్ చేయడం అసాధ్యమనుకోలేము. కనుక స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మొబైల్ సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేయాలనే కాంగ్రెస్‌ నేతల ప్రతిపాదనను అమలుచేయడం మంచిదే. 


Related Post