ప్రజాకూటమి ప్రయోగం ఫలిస్తుందా?

December 06, 2018


img

రాష్ట్రంలో కేసీఆర్‌ ధాటిని తట్టుకొని ఎన్నికలలో విజయం సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమి ప్రయోగానికి సిద్దపడింది. గతంలో టిడిపితో చేతులు కలిపి నష్టపోయామని తెరాస, బిజెపిలు చెపుతున్నప్పుడు తమ రాజకీయ శత్రువైన టిడిపితో కాంగ్రెస్‌ పార్టీ చేతులు కలపడం సాహసమేనని చెప్పవచ్చు. ఇంత సాహసించినందున ఆశించిన ఫలితాలు వస్తాయా రావా? వస్తే ఏమి జరుగుతుంది? రాకపోతే ఏమి జరుగుతుంది? అనే ఆలోచన కలగడం సహజం.      

సీట్ల సర్దుబాటు సమయంలో నాలుగు పార్టీల మద్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడే ప్రజాకూటమి ప్రయోగం విఫలం అవుతుందని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో కోదండరామ్‌, సిపిఐ పార్టీలు సంయమనం పాటించడంతో ప్రజాకూటమి మొదటి గండం గట్టెక్కింది. 

ప్రజాకూటమి బాలారిష్టాలు దాటుకొని ఎన్నికల కురుక్షేత్రంలో దిగిన తరువాత నాలుగు పార్టీలు చాలా ఐఖ్యతతో వ్యవహరించడంతో అనూహ్యంగా దాని బలం పెరిగింది. ప్రజాకూటమిలో పార్టీలు తమ ఐఖ్యతను బాగానే చాటుకొన్నప్పటికీ ఇల్లలకగానే పండుగ కాదన్నట్లు ప్రజాకూటమిపై తెరాస చేసిన ఆరోపణల కారణంగా ప్రజలకు దానిపై కొన్ని అనుమానాలు, అపోహలు ఏర్పడి ఉంటాయి కనుక అది ప్రజల నమ్మకం పొందిందా లేదా? అనే సందేహం ఉంది. దానికి సమాధానం తెలియాలంటే మరో 5 రోజులు వేచి చూడక తప్పదు. 

ఒకవేళ ఈ ఎన్నికలలో ప్రజాకూటమి విజయం సాధించి తెలంగాణలో అధికారంలోకి రాగలిగితే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో, లోక్ సభ ఎన్నికలలో కూడా ఇదే ప్రయోగం కొనసాగించడం తద్యం. దాంతో ఏపీలో పార్టీల బలాబలాలు మారుతాయి. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలని కలలుకంటున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలలో మరింత ఎక్కువగా చమటోడ్చవలసి వస్తుంది. ఇక దేశవ్యాప్తంగా బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రజాకూటమిలో చేరేందుకు ముందుకు రావచ్చు కనుక అప్పుడు ప్రజాకూటమి నుంచి మోడీకిగట్టి పోటీ తప్పదు. 

కానీ ఈ ఎన్నికలలో ప్రజాకూటమి ఓడిపోతే కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం తధ్యం. కనుక ప్రజాకూటమి విచ్చిన్నం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కనుక ప్రజాకూటమి భవిష్యత్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నప్పుడు ఈ ప్రజాకూటమి ఐడియా రాష్ట్ర, దేశ రాజకీయాలను మార్చుతుందా లేక బ్యాక్ ఫైర్ అవుతుందా? మరో 5 రోజులలో తేలిపోతుంది.  


Related Post