ఇంతకీ లగడపాటి ఎవరితో కుమ్మక్కు?

December 06, 2018


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై రెండు రోజుల క్రితం లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన సర్వే నివేదికపై సహజంగానే తెరాసకు ఆగ్రహం కలిగింది. రెండువారాల క్రితం తెరాస గెలుస్తుందని చెప్పిన లగడపాటి అంతలోనే ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. అందుకు ఆధారంగా తెరాస 60-70 సీట్లు గెలుచుకొంటుందని లగడపాటి తనకు పంపిన మెసేజ్ ను మంత్రి కేటిఆర్‌ మీడియాకు విడుదల చేశారు. 

దీనిపై లగడపాటి స్పందిస్తూ నేను సర్వే చేయించి తెరాస గెలుస్తుందని చెపితే నమ్మి నాకు థాంక్స్ చెప్పిన కేటిఆర్‌, స్వతంత్ర అభ్యర్ధులు గెలుస్తారంటే ఎందుకు నమ్మడం లేదు? ఈ ఎన్నికలలో ఏ పార్టీ గెలిచినా, ఓడినా నాకు నష్టం లేదు. నా పూర్తి సర్వే ఫలితాలు డిసెంబరు 7 సాయంత్రం బయటపెడతాను,” అని చెప్పారు. 

 లగడపాటి-కేటిఆర్‌ మద్య ఈ వాగ్వాదం నడుస్తుంటే, కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దీనిపై స్పందిస్తూ, “లగడపాటితో కేటిఆర్‌కు తెర వెనుక స్నేహసంబందాలున్నాయని వారి మద్య సాగిన మెసేజులు తెలియజేస్తున్నాయి. కేటిఆరే స్వయంగా వాటిని బయటపెట్టి దృవీకరించారు,” అని అన్నారు.        

లగడపాటి రాజగోపాల్ చంద్రబాబు నాయుడు ఏజంటని ఆయన ఒత్తిడి మేరకే తన సర్వే నివేదికను మార్చారని మంత్రి కేటిఆర్‌ ఆరోపిస్తుంటే, లగడపాటితో కేటిఆర్‌కు తెర వెనుక సంబంధాలున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించడం విశేషం. ఇంతకీ లగడపాటి ఎవరితో కుమ్మక్కు అయ్యారు? చంద్రబాబుతోనా లేక కేటిఆర్‌తోనా?


Related Post