అవును! ప్రజాస్వామ్యం గెలవాలి

December 06, 2018


img

ఈసారి అసెంబ్లీ ఎన్నికలు కూడా తెలంగాణలో పార్టీలకు, తాజా మాజీ ఎమ్మెల్యేలకు, ప్రజలకు అందరికీ ఒక అగ్నిపరీక్షగా నిలిచాయి. తెరాసది అధికారం నిలబెట్టుకోవాలనే తాపత్రయమైతే, ప్రజాకూటమిది తన మనుగడ కోసం చేస్తున్న అంతిమ పోరాటమని చెప్పవచ్చు. బిఎల్ఎఫ్, బిఎస్పి, మజ్లీస్ వంటి అనేక పార్టీలు, అనేకమంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 

గత రెండున్నర నెలలుగా వీరందరూ తమ తమ వాదనలను ప్రజలకు వినిపించి రేపు ప్రజాతీర్పు కోరుతున్నారు. కనుక ఏమాత్రం పొంతన లేని భిన్నమైన వాదనలు విన్న ప్రజలకు సరైన నిర్ణయం తీసుకోవడం నిజంగా అగ్నిపరీక్షేనని చెప్పవచ్చు. కానీ తప్పదు. 

ఒక పార్టీ జెండా, దాని అగ్రనేత మొహం లేదా ఆ పార్టీ అభ్యర్ధుల కులమతాలు చూసి ఓటు వేస్తే నష్టపోయేది ప్రజలే తప్ప పార్టీలు, వాటి నాయకులు కారని గుర్తుంచుకోవాలి. కనుక పోటీ చేస్తున్న అభ్యర్ధుల యోగ్యత, సమర్ధత, గుణగణాలు, గత చరిత్ర, వారి పనితీరును బట్టి సరైన వ్యక్తిని ఎంపిక చేసుకొన్నట్లయితే ఒక మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. అది చక్కటి పాలన అందిస్తుంది. కనుక రాష్ట్రంలో ఓటర్లు అందరూ రేపు ఉదయం పోలింగు బూతులకు వెళ్ళేలోగా బాగా ఆలోచించుకొని ఎవరికి ఓటేయాలో గట్టిగా నిర్ణయించుకొని వెళితే మంచిది. కాదని ప్రలోభాలకు లొంగి ఎవరో ఒకరికి ఓటేసేస్తే రాగల ఐదేళ్ళు వారే దానికి భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని మరిచిపోకూడదు.


Related Post