తెరాసకు ఎంపీ గుడ్ బై

November 20, 2018


img

త్వరలో ఇద్దరు తెరాస ఎంపీలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను మంత్రి కేటిఆర్‌ ‘చిల్లర రాజకీయలని’ ఖండించి మూడు రోజులు కాక ముందే , రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగానే తెరాస చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొద్ది సేపటిక్రితం తెరాసకు, తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన మూడు పేజీల రాజీనామా లేఖను తెలంగాణభవన్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు.  

తన రాజీనామాకు ప్రధానంగా 5 కారణాలను పేర్కొన్నారు. కానీ వాటిలో తెరాసలో తనకు సరైన గుర్తింపు గౌరవం లభించకపోవడం, తన అనుచరుల పట్ల పార్టీ వివక్ష చూపడం, గత రెండేళ్లుగా తెరాస, ప్రభుత్వం రెండూ కూడా ప్రజలకు దూరం అవుతుండటం, పార్టీలో అంతర్గత సమస్యలు అనే నాలుగు కారణాలు మాత్రమే బయటకు వచ్చాయి. అయితే అసలు కారణం మంత్రి మహేందర్ రెడ్డితో విభేధాలేనని తెలుస్తోంది. ఆ కారణంగా పార్టీలో ఆయన, అనుచరులు వివక్షకు గురవుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈనెల 23న మేడ్చల్ లో జరుగబోయే కాంగ్రెస్‌ బహిరంగసభలో సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తాజా సమాచారం.   

ఎన్నికలకు ముందు ఇటువంటి పరిణామం జరగడం తెరాసకు ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు. అయితే రేవంత్‌రెడ్డి ఈ విషయం బయటపెట్టినప్పుడే తెరాస ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్దపడింది కనుక వెంటనే తేరుకోగలదు. రేవంత్‌రెడ్డి చెప్పినట్లు ఒక ఎంపీ రాజీనామా చేసేరు కనుక త్వరలోనే మహబూబాబాద్‌ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ కూడా రాజీనామా చేసే అవకాశాలున్నట్లు భావించవచ్చునేమో?


Related Post