కేసీఆర్‌ సవాలుపై స్పందించిన నామా

November 20, 2018


img

సిఎం కేసీఆర్‌ నిన్న ఖమ్మం బహిరంగసభలో మాట్లాడుతూ, “జిల్లాలోని సీతారామ సాగర్ ప్రాజెక్టును నిలిపివేయించాలని కోరుతూ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ వ్రాశారు. ఆయన ఏ మొహం పెట్టుకొని ఖమ్మంలో ప్రజలను ఓట్లు అడగడానికి వస్తారు?ఆయన ఏ మొహం పెట్టుకొని ముగ్గురు టిడిపి నేతలను జిల్లా నుంచి పోటీ చేయిస్తున్నారు? ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ కేంద్రానికి వ్రాసిన లేఖ వెనక్కు తీసుకొని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తరువాతే ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టాలి,” అని అన్నారు. 

కేసీఆర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు, సవాలుపై ఖమ్మం టిడిపి అభ్యర్ధి నామా నాగేశ్వరరావు కూడా చాలా ఘాటుగా స్పందించారు. “కేసీఆర్‌ చంద్రబాబు నాయుడుపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తున్నారు. కేసీఆర్‌ చెపుతున్నట్లుగా సీతారామ ప్రాజెక్టు నిలిపివేయాలని చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎటువంటి లేఖ వ్రాయలేదు. సాధారణంగా ఒక రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టులపై ఇరుగుపొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను అభ్యంతరాలను తెలియజేస్తూ కేంద్ర జలవనరుల శాఖకు లేఖలు వ్రాస్తుంటాయి. కేసీఆర్‌ చెపుతున్న ఆ లేఖ ఏపీ ప్రభుత్వం వ్రాసిందే తప్ప చంద్రబాబునాయుడు వ్రాసింది కాదు. కేంద్రానికి చంద్రబాబు నాయుడు ఏమి లేఖ వ్రాశారంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇమ్మనమని కోరుతూ లేఖ వ్రాశారు. చంద్రబాబు నాయుడును విమర్శిస్తున్న కేసీఆర్‌ బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకపోయినా కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు నిలదీసి అడగటం లేదు? ట్రైబల్ యూనివర్సిటీ గురించి కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదు? కేసీఆర్‌ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే చంద్రబాబు నాయుడును బూచిగా చూపించి ప్రజలలో సెంటిమెంటు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో కేసీఆర్‌ ఖమ్మం జిల్లాకు ఏమి చేశారని తెరాసకు ఓట్లు వేయాలి?అసలు రాష్ట్రంలో టిడిపి లేనేలేదని గట్టిగా వాదించిన కేసీఆర్‌ ఇప్పుడు లేని టిడిపిని చూసి ఎందుకు భయపడుతున్నారు? చంద్రబాబునాయుడు నామజపం ఎందుకు చేస్తున్నారు?” అని నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు.


Related Post