కాంగ్రెస్‌ ఓడిపోతే ఉత్తమ్‌దే బాధ్యత?

November 17, 2018


img

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన కారణంగా గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ ఓడిపోయింది. కారణాలు అందరికీ తెలుసు. ఆ తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని పార్టీలో కొందరు నేతలు ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కాంగ్రెస్‌ అధిష్టానం అంగీకరించలేదు. తద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంపై పార్టీ అధిష్టానం పూర్తి నమ్మకం కలిగి ఉందని స్పష్టం చేయడమే కాకుండా ఈసారి కూడా ఆయన నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొబోతోంది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షులకు తమ అధిష్టానం నుంచి ఇంత మద్దతు ఎన్నడూ లభించదు. కనుక కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన ఈ నమ్మకాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలుపుకోగలుగుతారో లేదో చూడాలి.

ఈసారి ఆయన మహాకూటమి ప్రయోగం చేస్తున్నారు. ఆ ప్రయోగం ఫలించి కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగితే ఆ క్రెడిట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికే దక్కుతుంది. అలాగే ఈ ప్రయోగం బెడిసికొట్టి, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లయితే దానికీ ఉత్తమ్ కుమార్ రెడ్డే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. 

ఒకవేళ ఈసారి ఎన్నికలలో మహాకూటమి ఓడిపోయినట్లయితే దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలాగూ తన పదవికి రాజీనామా చేయవచ్చు. ముందే శపధం చేసినట్లు ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవచ్చు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది. కనుక మహాకూటమి ప్రయోగం విఫలమైతే కాంగ్రెస్ పార్టీ దానికి బారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కాంగ్రెస్‌ రెబెల్స్ వాదిస్తున్నట్లుగా కాంగ్రెస్‌ ఓటమికి, పతనానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధాన కారకుడు అవుతారు.

కనుక ఈసారి ఎన్నికలు ఆయనకు అగ్నిపరీక్ష వంటివేనని చెప్పవచ్చు. ఒకవేళ ఈ పరీక్షలో ఆయన విజయం సాధిస్తే, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఆయనకే ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు.


Related Post