కేసీఆర్‌ పాలనపై కుష్బూ విమర్శలు

November 17, 2018


img

ప్రముఖ సినీ నటి, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్‌ నాయకురాలు కుష్బూ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. శుక్రవారం జడ్చర్లలో నిర్వహించిన కాంగ్రెస్‌ రోడ్ షోలో ఆమె ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ కుటుంబానికి చెందిన నలుగురే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను పాలిస్తున్నారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదు. ఈ నాలుగేళ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడకుండా పోయింది. గత ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం రూ.225 కోట్లు ఖర్చు చేసి నాసిరకం చీరలు పంపిణీ చేసి మహిళలను అవమానపరిచింది. మిగిలిన ఆ సొమ్ము అంతా ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ప్రజలందరికీ తెలుసు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని కేవలం నాలుగేళ్లలో అప్పుల రాష్ట్రంగా మార్చివేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు కాంగ్రెస్ పార్టీ ముగింపు పలికి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించి, మహిళలతో సహా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తుంది,” అని కుష్భూ అన్నారు. 


Related Post