జనగామ సీటు పొన్నాలకే

November 17, 2018


img

జనగామ సీటుపై కాంగ్రెస్‌-టిజేఎస్ పార్టీల మద్య ఏర్పడిన ప్రతిష్టంభన వీడింది. జనగామ సీటును కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్యకు విడిచిపెట్టేందుకు టిజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ పెద్దమనసుతో అంగీకరించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా ప్రకటించారు. 

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, కోదండరామ్‌, పొన్నాల   నిన్న అర్దరాత్రి నుంచి 3 గంటల వరకు టిజేఎస్ కార్యాలయంలో సమావేశమయ్యి దీనిపై చర్చించారు. కోదండరామ్‌ జనగామ సీటును పొన్నాలకు విడిచిపెట్టేందుకు అంగీకరించారని కుంతియా తెలిపారు. కోదండరామ్‌కు ప్రజల నాడీ బాగా తెలుసు కనుక ఆయన రాష్ట్రమంతా తిరిగి మహాకూటమి అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారం చేస్తారని కుంతియా తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌-టిజేఎస్ సీట్ల సర్దుబాట్లపై కూడా స్పష్టత వచ్చిందని కుంతియా తెలిపారు. కాంగ్రెస్‌-94, టిజేఎస్-8, టిడిపి-14, సిపిఐ-3 స్థానాల నుంచి పోటీ చేయబోతున్నాయని కుంతియా తెలిపారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలన అంతమొందించడానికే ఏర్పడిన మహాకూటమి, ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో పేర్కొన్న ప్రతీ అంశాన్ని తూచా తప్పకుండా పాటిస్తుందని కుంతియా చెప్పారు. మహాకూటమి పేరును ప్రజాకూటమిగా మార్చినట్లు కుంతియా ప్రకటించారు. ప్రజాకూటమికి ప్రొఫెసర్ కోదండరాం కన్వీనర్ గా వ్యవహరిస్తారని వెల్లడించారు. 

ఇవాళ్ళ కాంగ్రెస్‌, టిజేఎస్ పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించి వారికి బి-ఫారంలు అందజేస్తాయని కుంతియా తెలిపారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు హుజూర్ నగర్ నుంచి నామినేషన్ వేయబోతున్నారు. టిజేఎస్ అభ్యర్ధులు కూడా నేటి నుంచి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. 


Related Post