ఓడిపోతే రాజకీయ సన్యాసం పక్కా: కేటిఆర్‌

November 15, 2018


img

మంత్రి కేటిఆర్‌ గురువారం మధ్యాహ్నం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో అనేక అంశాలపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన జవాబులు ఇచ్చారు. ఓ ప్రశ్నకు సమాధానంగా, “ఈ ఎన్నికలు మా నాలుగేళ్ల పరిపాలనకు రిఫరెండంగా భావిస్తున్నాము. మా పరిపాలన ప్రజలకు నచ్చిందనే గట్టి నమ్మకంతో మేము 100కు పైగా సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెపుతున్నాము. ఇది ఆత్మవిశ్వాసమనుకోండి లేదా ప్రజలపై మాకున్న నమ్మకమనుకోండి. ఒకవేళ ఈ ఎన్నికలలో మా పార్టీ ఓడిపోతే, మా అంతటా మేముగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. ఎన్నికల తరువాత మళ్ళీ ఇక్కడ మీ ముందుకు రాను. కనబడను,” అని చెప్పారు.

కేసీఆర్‌ నియంతృత్వ పాలన చేస్తూ అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకొన్నారనే ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “సిఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌ దాటి బయటకు రారు... ఎన్నడూ సచివాలయానికి వెళ్లరు...అంటూ ప్రతిపక్ష నేతలు రోజూ చేసే విమర్శలను మేమూ వింటున్నాము. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా అధికార వికేంద్రీకరణ చేసి, 500 మంది జనాభా ఉన్న తండాలను పంచాయితీలుగా మార్చి ప్రజలకే అధికారాలు పంచిపెడుతున్న ఏకైక వ్యక్తి సిఎం కేసీఆర్‌. మారుమూల ప్రాంతాలలో ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు, పింఛన్లు అందేలా పాలన సాగిస్తున్న గొప్ప పరిపాలన దక్షుడు సిఎం కేసీఆర్‌. ఇదివరకు గ్రామాలలో సమస్యలుంటే వాటి కోసం మంత్రుల కార్యాలయాల చుట్టూ తిరగవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ పంచాయితీలను, కలెక్టర్ కార్యాలయాలను ఏర్పాటు చేసి ఎక్కడి సమస్యలౌ అక్కడే పరిష్కరింపబడేలా చేస్తున్నారు సిఎం కేసీఆర్‌. ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రజలకు రేషన్ కార్డులు, పింఛన్లు పంచుతున్నాడంటే ఒక అసమర్ధుడు అని భావించవచ్చు. ముఖ్యమంత్రి బాధ్యత రాష్ట్రంలో పరిపాలనా యాంత్రాంగాన్ని సక్రమంగా పనిచేయించడం, ప్రజా అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా పధకాలు, ప్రణాళికలు రూపొందించి వాటిని సమర్ధంగా అమలుచేయించడం. సిఎం కేసీఆర్‌ అదే చేస్తున్నారు. మరి అధికారాలను ఆయన గుప్పెట్లో పెట్టుకొన్నారని ఏవిధంగా అనగలరు?” అని మంత్రి కేటిఆర్‌ ఎదురు ప్రశ్నించారు.


Related Post