ఆ జాబితాలు నిజం కావు: ఉత్తమ్

November 08, 2018


img

మీడియాలో బుదవారం సాయంత్రం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధుల తుది జాబితా ఇదేనంటూ వార్తలు వస్తున్నాయి. వాటిలో ఎవరెవరు ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారో వివరాలున్నాయి. మీడియాలో వస్తున్న ఈ వార్తలపై మహాకూటమిలో టిజేఎస్, సిపిఐ పార్టీలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే మీడియాకు ఇటువంటి లీకులు ఇస్తూ తమను అవమానిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరమణ, టిజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ పార్టీ సీట్లు, నియోజకవర్గాల సంగతి తేల్చకుండా తమ అభ్యర్ధుల జాబితాలను మీడియాలో ప్రకటించుకోవడాన్ని వారు తప్పు పట్టారు. తాము కోరుకొన్నన్ని సీట్లు, నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వవలసిందేనని వారు తెగేసి చెప్పారు. 

దీనిపై స్పందించిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీ అభ్యర్ధుల జాబితాలంటూ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్దం. మేము ఇతవరకు మా అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయనేలేదు. పార్టీలో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులతో ఇంకా చర్చలు నడుస్తున్నాయి. అవి ముగిసిన తరువాత మహాకూటమిలో మా భాగస్వాములతో చర్చించి, రేపు సాయంత్రం అభ్యర్ధుల జాబితాలను విడుదల చేస్తాము. మేము అధికారికంగా ప్రకటించే వరకు మీడియాలో వస్తున్న జాబితాలను ఎవరూ నమ్మవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.


Related Post