తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తా: చంద్రబాబు

October 23, 2018


img

ఏపీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టిటిడిపి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారికి ముఖ్యమైన సూచనలు, సలహాలు ఇచ్చి దిశా నిర్దేశం చేశారు. అలాగే తనపై సిఎం కేసీఆర్‌, తెరాస నేతలు చేస్తున్న విమర్శలపై తొలిసారి ధీటుగా స్పందించారు.

“ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు కలిసిమెలిసి ముందుకు సాగాలని నేను సిఎం కేసీఆర్‌కు స్నేహహస్తం అందిస్తే ఆయన తిరస్కరించడమే కాకుండా తెలంగాణలో టిడిపి ఉండకూడదంటూ నా గురించి చాలా అవమానకరంగా మాట్లాడుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. సిఎం కేసీఆర్‌ నన్ను దూషిస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్‌ అభివృద్ధికి నేనెంత కష్టపడ్డానో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్‌ నన్ను దూషించడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. 

తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మేము మహాకూటమిగా ఏర్పడితే దానినీ సిఎం కేసీఆర్‌ తప్పు పడుతున్నారు. అయితే ఎవరు ఏమనుకొన్నా రాష్ట్రంలో టిడిపి ఉంటుంది. అలాగే మహాకూటమి ఏర్పాటు ఖాయం. నేను టిడిపి అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను. ఈ మహాకూటమి దేశరాజకీయాలను మార్చే స్థాయికి ఎదగాలని నేను కోరుకొంటున్నాను. లోక్ సభ ఎన్నికలలో బిజెపిని ఓడించి, మోడీని గద్దె దించడమే లక్ష్యంగా మహాకూటమి పనిచేస్తుంది,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.    

సిఎం కేసీఆర్‌, తెరాస నేతల స్థాయిలో కాకపోయినా మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు తెరాస విమర్శలకు నేరుగా బదులివ్వడం, తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తానని ప్రకటించడం విశేషమే. తెలంగాణలో టిడిపి నేతలకు ఉత్సాహం కలిగించేందుకే చంద్రబాబు నాయుడు ఈవిధంగా మాట్లాడి ఉండవచ్చు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై తెరాస నేతలు ఇంకా ఘాటుగా స్పందించడం ఖాయం కనుక వాటికీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా సమాధానం చెపుతారో లేదో చూడాలి.


Related Post