తెరాసకు బిజెపి వార్నింగ్

October 22, 2018


img

తెరాస-బిజెపిలు రాజకీయంగా శత్రువులే కావచ్చు కానీ సిఎం కేసీఆర్‌-ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం కారని అందరికీ తెలుసు. కనుక సిఎం కేసీఆర్‌, ఆయన ప్రభుత్వంపై రాష్ట్ర బిజెపి నేతల విమర్శలను ఎవరూ సీరియస్ గా తీసుకోరు. చివరికి సిఎం కేసీఆర్‌, తెరాస మంత్రులు కూడా వాటిని పట్టించుకోరు.

తెలంగాణభవన్‌లో నిన్న జరిగిన తెరాస సమావేశంలో సిఎం కేసీఆర్‌ పార్టీ అభ్యర్ధులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఈసారి బిజెపి ఓట్లు కూడా తెరాస ఖాతాలోనే పడబోతున్నాయంటూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. అంటే బిజెపి గెలిచే అవకాశం లేదు కనుక దానికి ఓట్లు వేస్తే వృధా అయిపోతాయి కనుక తెరాసకు వేస్తారని ఆయన ఉద్దేశ్యం కావచ్చు.

ఇదివరకు ఒకసారి వేరే సందర్భంలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ఈసారి ఎన్నికలలో బిజెపి ఒకటి రెండు సీట్లు గెలుచుకొన్నా అది చాలా గొప్ప విషయమే అవుతుందని అన్నారు. సిఎం కేసీఆర్‌, తెరాస నేతలు బిజెపి ఉనికినే పట్టించుకోనట్లు వ్యవహరిస్తుంటే, రాష్ట్ర బిజెపి నేతలు మాత్రం తెరాసకు తామే ఏకైక ప్రత్యామ్నాయం అన్నట్లు మాట్లాడుతుండటం విశేషం. 

బిజెపి సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌, తెరాసలు రెండూ కూడా ప్రజలను మోసం చేశాయి కనుక ప్రజలు వాటిని నమ్మడం లేదు. అమరవీరుల త్యాగాల కారణంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అబద్దపు హామీలతో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయకుండా కుటుంబపాలన చేశారు. కేసీఆర్‌ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు చాలా అసహనంగా, అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్‌, తెరాసలకు ఏకైక ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమే. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే సిఎం కేసీఆర్‌, ఆయన మంత్రుల అవినీతిపై విచారణ జరిపిస్తాము. అందుకు వారందరూ సిద్దంగా ఉండాలి,” అని హెచ్చరించారు.


Related Post