కాంగ్రెస్‌ పార్టీపై ఎంపీ గుత్తా విమర్శలు

October 22, 2018


img

గుత్తా సుఖేందర్ రెడ్డి తెరాసలో చేరి తెలంగాణ రైతు సమన్వయ సమితికి ఛైర్మన్ గా నియమితులైనప్పటికీ, నేటికీ కాంగ్రెస్‌ ఎంపీగానే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ వలన లభించిన ఆ పదవిలో కొనసాగుతూనే ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

“కాంగ్రెస్ పార్టీ టిడిపి, టిజేఎస్, సిపిఐలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి ఈ ఎన్నికలలో విజయం సాధించవచ్చునని పగటికలలు కంటోంది. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఘోరపరాజయం తప్పదు. జానారెడ్డితో సహా కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్ నేతలందరికీ కూడా పరాజయం తప్పదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. ఈసారి కూడా తెరాస ఘనవిజయం సాధించడం ఖాయం. సిఎం కేసీఆర్‌ అమలుచేసిన, మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు అమలుచేయబోతున్న అనేకానేక సంక్షేమ పధకాలే తెరాసను గెలిపించబోతున్నాయి. మళ్ళీ సారి అధికారంలోకి వచ్చినప్పుడు పేదలకు వారి స్వంత స్థలాలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టుకొనే విధంగా ఒక పధకం అమలుచేయబోతున్నాము. అలాగే ఇప్పటి వరకు వృద్ధాప్య పింఛను 65 ఏళ్ళు నిండినవారికే ఇస్తుండగా, మళ్ళీ తెరాస అధికారంలోకి వస్తే 57 ఏళ్ళకే పింఛను ఇవ్వబోతున్నాము. రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా సాగిస్తున్న సిఎం కేసీఆర్‌ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు,” అని అన్నారు. 

గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో ఎందుకు చేరారో కాంగ్రెస్‌ నేతలను అడిగితే చెపుతారు. కానీ ‘తెలంగాణ అభివృద్ధి కోసం సిఎం కేసీఆర్‌ చేస్తున్న కృషిని చూసి తెరాసలో చేరాను’ అని చిలుకలాగ వల్లె వేస్తుంటారు. అది వేరే విషయం. 

ఆయన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ప్రస్తావన చేశారు కనుక వాటి గురించి మాట్లాడితే తెరాస సర్కారును వేలెత్తి చూపవలసి వస్తుంది. ఈ ఏడాది డిసెంబరులోగా ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే లక్ష ఇళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా మరో లక్షన్నర కలిపి మొత్తం 2.5 లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తామని మంత్రి కేటిఆర్‌ అనేకసార్లు చెప్పారు. కానీ గత నాలుగున్నరేళ్ళలో రాష్ట్రమంతటా కలిపి కనీసం 25,000 ఇళ్ళు నిర్మించి ఇవ్వలేకపోయింది. 

గత ఎన్నికలలో ఇచ్చిన ఈ హామీని నెరవేర్చకుండా మళ్ళీ అధికారంలోకి వస్తే సొంత స్థలాలు కలిగినవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టుకొనే అవకాశం కల్పిస్తామని గుత్తా చెప్పడం ఇంకా హాస్యాస్పధంగా ఉంది. అంటే ఆవిధంగా భూమి కొనుగోలు చేసే భారం తగ్గించుకోవాలని తెరాస చూస్తోందని అర్ధమవుతోంది.


Related Post