పాపం రాహుల్ గాంధీ! తెరాస ఎంపీ

October 20, 2018


img

ఈరోజు కామారెడ్డి కాంగ్రెస్‌ బహిరంగసభలో రాహుల్ గాంధీ సిఎం కేసీఆర్‌, తెరాస ప్రభుత్వ పనితీరుపై చేసిన విమర్శలకు తెరాస ఎంపీ వినోద్ కుమార్ మొట్టమొదట స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆయన దాని ఆధారంగానే మాట్లాడేశారు తప్ప దానిలో నిజానిజాలను నిర్దారించుకోలేదు. ఆ కారణమగా ఆయన తొలి ఎన్నికల ప్రచారసభతోనే నవ్వులపాలయ్యారు. ‘మా ప్రభుత్వానికి బడుగుబలహీన వర్గాలంటే చులకన’ అని చెప్పడానికి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చేశామని రాహుల్ గాంధీకి కాంగ్రెస్‌ నేతలు తప్పుడు సమాచారం ఇచ్చారు. నిజానికి మేము దానిని కాళేశ్వరం ప్రాజెక్టు అని పిలుస్తున్నప్పటికీ నేటికీ రికార్డులలో అధికారికంగా దానిని బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుగానే వ్యవహరిస్తున్నాము. ఈసంగతి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు తెలుసో తెలియదో కానీ వారు ఈవిషయంలో తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించారు.” 

“ఇక యూపీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టం-2013ను అమలుచేయలేమని దేశంలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాలు చేతులెత్తేస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం మల్లన్నసాగర్ ప్రాజెక్టులో దానిని అమలుచేసింది. ఈవిషయం తెలుసుకోకుండా కాంగ్రెస్‌ నేతలు తమ అధినేతకు తప్పుడు సమాచారం ఇచ్చి దానిగురించి తప్పుగా మాట్లాడించారు. అయినా సాగునీటి ప్రాజెక్టుల గురించి శాసనసభ, విధానసభలో చర్చిస్తున్నప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాటిలో పాల్గొని ఉండి ఉంటే వారికి వాటి గురించి అవగాహన ఏర్పడి ఉండేది. వారికే తెలియనప్పుడు ఇక తమ అధినేత రాహుల్ గాంధీకి ఏమి చెప్పగలరు?” అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.  

కాంగ్రెస్‌ హయాంలో నెలకు రూ.200 పింఛను సక్రమంగా ఇవ్వలేకపోయినప్పుడు, ఇప్పుడు నెలకు రూ.3,000 నిరుద్యోగభృతి, రూ.2,000 పింఛన్లు ఏవిధంగా ఇవ్వగలదు? కాంగ్రెస్‌ మాటలను ప్రజలు నమ్ముతారా?కాంగ్రెస్ పార్టీ ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలనుకొంటోందే తప్ప దానికి చిత్తశుద్ది లేదు. కేవలం తెరాస మాత్రామే ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలుచేయగలదు,” అని వినోద్ కుమార్ అన్నారు. Related Post