అయ్యో అయ్యప్పా!

October 20, 2018


img

అయ్యప్ప స్వామి పేరు వినబడితే అయ్యప్ప స్వాముల దీక్షలు, దట్టమైన అడవులలో నెలకొన్న శబరిమలై ఆలయం కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. కానీ ఇప్పుడు అయ్యప్ప స్వామి ఆలయం వివాదాలకు, ఉద్రిక్తతలకు, రాజకీయాలకు కేంద్రబిందువుగా మారడం చాలా బాధాకరం. నిన్న శుక్రవారం కూడా ఇద్దరు మహిళలు పోలీసుల రక్షణలో అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలను అయ్యప్ప భక్తులు, ఆలయ పూజారులు అడ్డుకొన్నారు. ఒకవేళ పోలీసుల సహాయంతో లోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తే ఆలయం మూసీవేయడానికి వెనుకాడబోమని హెచ్చరించడంతో వారు వెనుతిరిగారు. అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చుననే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఆలయ ధర్మకర్తల మండలి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కూడా వారిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. 

సుప్రీంకోర్టు చట్టాలను, మానవహక్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని తీర్పు చెప్పడం సమంజసం కాదని, అనాదిగా వస్తున్న ఆలయ ఆచార వ్యవహారాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఉంటే ఈవిధంగా తీర్పు చెప్పేది ఉండేది కాదని ఒకవర్గం వాదిస్తుంటే, దేశానికి సర్వోన్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలుచేయకుండా ధిక్కరించడం ద్వారా ఒక దుస్సంప్రదాయానికి ఆందోళనకారులు బీజం వేస్తున్నారని మరో వర్గం వాదిస్తోంది. 

ఈవాదోపవాదాలలో కాంగ్రెస్‌, బిజెపి, ఆర్.ఎస్.ఎస్., వామపక్షాలు కూడా తమతమ వాదనలు వినిపిస్తున్నాయి. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించవలసి ఉండగా దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం విశేషం. ఆర్.ఎస్.ఎస్. సహజంగానే బిజెపికి మద్దతు పలుకుతోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ బిజెపి వాదనను వ్యతిరేకిస్తుంటుంది కనుక ఈ విషయంలో కూడా దానిని వ్యతిరేకిస్తోంది. ఆధ్యాత్మికతకు నిలయంగా ఉండే అయ్యప్ప స్వామి ఆలయం ఈవిధంగా ఆందోళనలకు, రాజకీయాలకు కేంద్రంగా మారడం చూస్తే బాధ కలుగకమానదు. 


Related Post