పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం

October 19, 2018


img

శుక్రవారం సాయంత్రం పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జలంధర్ నుంచి అమృతసర్ వెలుతున్న డీఎంయూ రైలు పట్టాలపై నిలుచొనున్న ప్రజలను గుద్దుకొని దూసుకుపోవడంతో 50 మంది ప్రాణాలు కోల్పోగా మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 

దసరా పండుగ సందర్భంగా శుక్రవారం సాయంత్రం అమృతసర్ సమీపంలో జోధా పాఠక్ అనే ప్రాంతంలో రావణ దహనం కార్యక్రమం జరుగుతోంది. దానిని చూసేందుకు వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోవడంతో అక్కడే ఉన్న రైల్వే పట్టాలపై కూడా వందాలదిమంది నిలబడిచూస్తున్నారు. అదే సమయంలో జలంధర్ నుంచి అమృతసర్ వెలుతున్న డీఎంయూ రైలు గంటకు సుమారు 80 కిమీ వేగంతో దూసుకువచ్చింది. 

రైలు డ్రైవరు, పట్టాలపై ఉన్న ప్రజలు గమనించేలోగా ఇంత ఘోర ప్రమాదం జరిగిపోయింది. రైలు చాలా వేగంగా వచ్చి డ్డీకొనడంతో పట్టాలపై నిలబడి ఉన్నవారిలో కొంతమంది రైలు క్రింద పడి నలిగిపోగా, మరికొంతమంది గాలిలో విసిరేసినట్లు ఎగిరి పడ్డారు. అంతవరకు పండుగ వాతావరణం నెలకొని ఉన్న ఆ ప్రాంతమంతా ఒక్క నిమిషంలో భయానకంగా మారిపోయింది. ఎక్కడ చూసిన తెగిపడిన శరీరభాగాలు, నూజ్జునుజ్జు అయిన శరీరాలు, గాయపడినవారి ఆక్రందనలతో నిండిపోయింది. 

ఈ సమాచారం అందుకొన్న జిల్లా, రైల్వే అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక శాఖ బృందాలు  హుటాహుటిన అక్కడకు చేరుకొని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావించవచ్చు.



Related Post