బిజెపిలో చేరిన స్వామీజీ

October 19, 2018


img

నిత్యం కాషాయ వస్త్రాలు ధరించి తిరిగే శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద శనివారం బీజేపీలో చేరి రాజకీయ కాషాయకండువా కూడా కప్పుకొన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం స్వామిజీ మీడియాతో మాట్లాడుతూ, “ఇంతవరకు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకే పరిమితమైన నేను ఇకపై దేశసేవ చేయాలనే ఉద్దేశ్యంతో దేశం కోసం,ధర్మం కోసం పాటుపడుతున్న బిజెపిలో చేరాను. ఆధ్యాత్మికమార్గంలో ఎంత త్రికరణశుద్ధిగా పనిచేశానో, బిజెపి కోసం కూడా అంతే త్రికరణశుద్ధిగా పనిచేస్తాను. పార్టీ నాకు ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా స్వీకరించి అమిత్ షాగారి నేతృత్వంలో పనిచేస్తాను,” అని అన్నారు. 

ఆధ్యాత్మికమార్గంలో సాగుతున్న స్వామి పరిపూర్ణానంద రాజకీయాలలో చేరడం కొంచెం ఆశ్చర్యామ్ కలిగిస్తున్నప్పటికీ దానికి బలమైన కారణమే కనిపిస్తోంది. సినీ విమర్శకుడు కత్తి మహేశ్ వివాదంలో ఆయనను తెరాస ప్రభుత్వం హైదరాబాద్‌ నగర బహిష్కరణ చేయడం అందరికీ తెలిసిందే. దానిని తీవ్ర అవమానంగా భావించిన ఆయన, తనపై హైకోర్టు బహిష్కరణ ఎత్తివేసిన తరువాత మళ్ళీ నగరంలో ప్రవేశిస్తూ ‘తెరాసను ఓడించి రాష్ట్రంలో కాషాయ జెండాలను రెపరెపలాడించడానికి శాయాశక్తుల కృషి చేస్తానని’ శపధం చేశారు. అప్పుడే బిజెపిలో చేరేందుకు నిర్ణయించుకొన్నారని స్పష్టం అవుతోంది. ఆయన కూడా బిజెపిలాగే హిందుత్వ మార్గంలో సాగుతున్నందున ఆయనకు బిజెపి నేతలతో చిరకాలంగా సత్సంబంధాలున్నాయి కనుక ఆయన బిజెపిలో చేరడానికి నగరబహిష్కరణ ప్రేరేపించి ఉండవచ్చు. స్వామి పరిపూర్ణానందకు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో అనేకమంది భక్తులు ఉన్నారు కనుక ఆయన చేరిక బిజెపికి ఎంతో కొంత మేలు చేయవచ్చు.


Related Post