అక్టోబర్ 27లోగా అభ్యర్ధులను ప్రకటిస్తాం: జానారెడ్డి

October 18, 2018


img

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ వారం రోజుల క్రితం మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లకు 48 గంటలు గడువిచ్చినా ఇంతవరకు ఆ చర్చలు ఒక కొలిక్కిరాలేదు. ఈ చర్చలు ఎంతకీ ఒక కొలిక్కి రాకపోవడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. వారు మహాకూటమిలో భాగస్వాములుగా ఉన్నా టిజేఎస్, టిడిపి, సిపిఐ పార్టీల నేతలతో చర్చిస్తున్నారు. సీట్ల సర్దుబాట్ల చర్చలపై మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు జానారెడ్డి సమాధానం చెపుతూ, “చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీలోగా మహాకూటమి అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తాము,” అని చెప్పారు. 

 సెప్టెంబరు 6వ తేదీన శాసనసభను రద్దు చేసిన వెంటనే సిఎం కేసీఆర్‌ 105 మంది తెరాస అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు. అప్పటి నుంచి వారందరూ తమతమ నియోజకవర్గాలలో జోరుగా ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారు. కానీ నెలన్నర గడిచిపోయినా మహాకూటమిలో ఇంతవరకు సీట్ల సర్దుబాట్లపై చర్చలే పూర్తికాలేదు. ఈ నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉందని జానారెడ్డి చెపుతున్నారు. అప్పటికైనా పూర్తయితే మంచిదే లేకుంటే మహాకూటమి ఆలోచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ భారీగా మూల్యం చెల్లించవలసిరావచ్చు. ఎందుకంటే మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లు ప్రక్రియ పూర్తయిన తరువాత కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ దక్కనివారి అలకలు, తిరుగుబాట్లు, బుజ్జగింపుల తంతు ఒకటుంటుంది. అది ఎప్పటికీ ముగుస్తుందో తెలియదు కానీ నవంబరు 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆరోజు నుంచి నవంబరు 19 లోపుగా అభ్యర్ధులు నామినేషన్లు వేయవలసి ఉంటుంది. కనుక మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లు ఎంత ఆలస్యమైతే అంతా కాంగ్రెస్ పార్టీకే నష్టం అని చెప్పవచ్చు. 


Related Post