సుప్రీం చిచ్చు..శరణం అయ్యప్పా

October 17, 2018


img

కేరళలోని శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయంలోకి అనాదిగా మహిళలకు ప్రవేశం లేదు. రజస్వల కాని బాలికలకు, వృద్ద మహిళలకు మాత్రమే ఆలయ ప్రవేశం లభిస్తుంది. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కనుక ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం పాటిస్తున్నారు. అయితే నేటి ఆధునిక యుగంలో మహిళలపట్ల ఈవిదంగా వివక్ష చూపడం వారి ప్రాధమిక హక్కును తిరస్కరించడమేనని కనుక ఇక నుంచి అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చునని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఆ తీర్పే ఇప్పుడు కేరళలో ప్రజల మద్య చిచ్చు పెట్టింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వమూ, రాష్ట్రంలో ఒకవర్గం ప్రజలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తుండగా, మరొకవర్గం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కేరళ రాష్ట్రంలో చాలా ఉదృతంగా ఆందోళనలు సాగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఆనవాయితీ ప్రకారం అయ్యప్ప స్వామి ఆలయం బుదవారం సాయంత్రం 5గంటలకు తెరుచుకోవడంతో ఆధ్యాత్మికకు నిలయమైన శబరిమలై పరిసర ప్రాంతాలలో అనుకూల వ్యతిరేక వర్గాల ఘర్షణలతో...వారిని అదుపు చేసేందుకు మోహరించిన వేలాదిమంది పోలీసులతో యుద్దరంగాన్ని తలపిస్తోంది. సాయంత్రం 5 గంటలకు ఆలయం తలుపులు తెరుచుకొన్నాయి కానీ ఇంతవరకు ఒక్క మహిళ కూడా ఆలయంలో లోపలకి ప్రవేశించలేకపోయినట్లు సమాచారం. 

నేటి నుంచి 5 రోజుల పాటు ఆలయం తెరిచి ఉంటుంది. కనుక ఈ 5 రోజులలో ఏమి జరుగబోతోందనేది ఎవరూ ఊహించలేకపోతున్నారు. ప్రస్తుతం శబరిమలై పరిసర ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుళు నెలకొని ఉన్నాయి. సుప్రీంకోర్టు రగిల్చిన ఈ చిచ్చును ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆర్పలేదు. ఒకవర్గం భక్తుల ఒత్తిడికి తలొగ్గి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొంటే, ప్రజల దృష్టిలో చులకనవడమే కాకుండా, మహిళా హక్కుల సంఘాలు ఆందోళనలు మొదలుపెట్టవచ్చు. కనుక ఈ చిచ్చును ఆర్పగలవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే స్వామి అయ్యప్ప. కనుక స్వామి శరణం అయ్యప్ప శరణం అనుకొంటూ జరుగబోయే పరిణామాలను చూస్తుండవలసిందే.


Related Post