రాములు నాయక్ స్పందన

October 16, 2018


img

తెరాస ఎమ్మెల్సీ రాములు నాయక్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై స్పందిస్తూ నిన్న హైదారాబాద్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. “తెలంగాణభవన్‌ నిర్మాణం కోసం నేను ఎంత శ్రమ పడ్డానో సిఎం కేసీఆర్‌కు కూడా తెలుసు. ఆలాగే నేను ఆయనకు, పార్టీకి ఎంత విధేయంగా పనిచేశానో కూడా ఆయనకు తెలుసు. కానీ కనీసం నాతో ఒక్కసారి మాట్లాడి నా వివరణ తీసుకోకుండానే నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అదేదో ఆయన నోటితోనే చెప్పినా నేను సంతోషించేవాడిని కానీ తెలంగాణ ద్రోహి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేత ఆ ప్రకటన చేయించడం నాకు చాలా బాధ కలిగించింది.

తెరాసలో అంతర్గత ప్రజాస్వామ్యానికి, ఆత్మగౌరవానికి చోటు లేదు. అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వంటిది. 2004 నుంచి నేటి వరకు అనేకసార్లు ఎన్నికలు జరిగాయి. కానీ ప్రతీసారి నేను నోరు తెరిచి అడిగినా కేసీఆర్‌ ఏనాడూ నాకు టికెట్ ఇవ్వాలనుకోలేదు. చివరికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి లభించింది అంతే. పార్టీలో గిరిజనులకు జనాభా ప్రతిపదికన పదవులు, టికెట్లు కేటాయించాలని కోరినందుకు నాకు ఈ శిక్ష విధించబడినట్లు భావిస్తున్నాను.

తెరాసలో నాలాగ బాధ పడుతున్నవారు ఇంకా చాలా మందే ఉన్నారు. వారందరూ కూడా త్వరలోనే తెరాస నుంచి బయటకు వచ్చేస్తారు. ఒకప్పుడు ఉద్యమకారులను తరిమికొట్టినవారికి తెరాస ప్రభుత్వంలో, పార్టీలో పదవులు, ప్రాధాన్యత లభిస్తోంది. నావన్తి ఉద్యమకారులకు బహిష్కరణ బహుమానాలుగా లభిస్తున్నాయి.

నేను కాంగ్రెస్‌ నేతలను కలవాలనే ఉద్దేశ్యంతో ఆదివారం గోల్కొండ హోటల్ కు వెళ్లలేదు. అక్కడ ఉన్న నా స్నేహితుడిని కలిసేందుకు నేను వెళ్లినప్పుడు రేవంత్‌రెడ్డి తదితరులు ఎదురైతే మర్యాదపూర్వకంగా పలకరించాను. అంతే. కానీ ఆ వంకతో నన్ను పార్టీ నుంచి బహిష్కరించడం నాకు చాలా బాధ కలిగించింది.” అని రాములు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.


Related Post