మందుబాబులకు చేదు వార్త

October 16, 2018


img

మందుబాబులకు ఒక చేదు వార్త. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో బార్లు, వైన్ షాపులు అన్నీ మూసివేయబడతాయి. అయితే అప్పుడే కంగారు పడనవసరం లేదు. ఎందుకంటే, ఇది రాష్ట్ర బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ఒక అంశం మాత్రమే. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దీనిని అమలుచేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ చెప్పారు.

ఆయన ఆదివారం హైదారాబాద్ లో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వాలకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ప్రధాన ఆదాయవనరుగా ఉంటోంది. అందుకే మద్యపాన నిషేధం అమలుచేయడానికి ఏ ప్రభుత్వమూ ఆసక్తి చూపడం లేదు. కానీ మద్యపానం వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. వారి కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్నాయి. కనుక రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధిస్తాము. సాయంత్రం 6 గంటల తరువాత రాష్ట్రంలో బార్లు, వైన్ షాపులు అన్నీ మూసివేయిస్తాము,” అని చెప్పారు. 

బిజెపి మేనిఫెస్టోలో చేర్చబోతున్న మరో రెండు అంశాలను కూడా ప్రభాకర్ మీడియాకు వివరించారు. 

1. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్ పన్నును పూర్తిగా తొలగిస్తాం. 

2. పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులకు ఉచితంగా ఆన్-లైన్ మరియు ఆఫ్-లైన్ కోచింగ్ ఇప్పిస్తాము. 

3. పండుగ సమయాలలో ఆర్టీసీ బస్సులలో సర్-ఛార్జ్ పేరుతో అధనంగా డబ్బు వసూలు చేస్తోంది. దానిని నిషేధిస్తాము.

4. దీక్షలు స్వీకరించిన భక్తులు తెలంగాణలో ప్రముఖ దేవాలయాలతో సహా శబరిమలై వంటి ఇతర రాష్ట్రాలలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళేందుకు బస్సులలో ఉచిత సౌకర్యం కల్పిస్తాము. 

5. నెలకు కేవలం రూ.6లకే ప్రతీ ఇంటికి రక్షిత మంచినీటిని అందిస్తాం. 


Related Post