తెరాస ఎమ్మెల్సీ సస్పెండ్

October 15, 2018


img

తెరాస ఎమ్మెల్సీ రాము నాయక్ ను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు పార్టీ  నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెరాస ప్రకటించింది. ఆయన నారాయణఖేడ్‌ నియోజకవర్గం నుంచి తెరాస టికెట్ ఆశించి భంగపడ్డారు. దాంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకొని ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఆయనకు నచ్చ చెప్పేందుకు తెరాస నేతలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆయన నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొంటున్నట్లు చెప్పడం, వెనువెంటనే ఆయన రాము నాయక్ ను రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్-చార్జ్ రామచంద్ర కుంటియాతో భేటీ ఏర్పాటు చేయడం జరిగిపోయింది.

టికెట్ విషయంలో కుంటియా కూడా ఎటువంటి హామీ ఇవ్వనప్పటికీ సానుకూలంగా స్పందించడంతో రాములు నాయక్‌ తాను తెరాసను వీడబోతున్నట్లు మీడియాకు తెలియజేశారు. మరికొద్ది సేపటిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడబోతున్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఆయన సమక్షంలో రాము నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. 


Related Post