కాంగ్రెస్‌ ముందే ఓటమిని అంగీకరించింది: కడియం

October 13, 2018


img

మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం  జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటీల సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కోకమునుపే ఓటమి అంగీకరించింది. తన బద్ద శత్రువైన టిడిపితో పొత్తులు పెట్టుకోవడం, ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలలో పిటిషన్లు వేయడం అందుకు బలమైన ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఎన్నికలలో గెలవలేమని గ్రహించబట్టే కాంగ్రెస్‌ నేతలు ఎన్నికలను అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కనుక తెరాసలో అందరూ తమ అభిప్రాయభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేసి ప్రతీ తెరాస అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి,” అని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా తెరాసను డ్డీకొని ఓడించలేదనే అభిప్రాయంతోనే మహాకూటమిని ఏర్పాటు చేసుకొంటున్న మాట వాస్తవం. ఆ విషయం కాంగ్రెస్‌ నేతలే ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పుకొంటున్నారు కూడా. అయితే త్వరలో జరుగబోయే ఎన్నికలలో తెరాసను ఓడిస్తామని గట్టిగా వాదిస్తున్న కాంగ్రెస్‌ నేతలు మరోపక్క ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తూ కోర్టులలో పిటిషన్లు వేస్తుండటం వారిలో భయాందోళనలకు నిదర్శనంగా భావించవచ్చు. ఇంకా మహాకూటమిలో సీట్ల పంపకాలు పూర్తయితే, కాంగ్రెస్ పార్టీలో అగ్నిపర్వతం బద్దలవ్వవచ్చు. టికెట్లు ఆశించి భంగపడినవారు, సీట్ల సర్దుబాట్లలో భాగంగా టికెట్ దక్కనివారి వలన కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు మొదలవవచ్చు. 


Related Post