తెరాసకు 20 మాకు 80: ఉత్తమ్

October 13, 2018


img

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ మాయ మాటలను నమ్మి తెరాస అభ్యర్ధులు అందరూ తామే గెలుస్తామని పగటికలలు కంటున్నారు. కానీ మహా కూటమి చేతిలో తెరాస ఓటమి ఖాయం. డిసెంబర్ 12 తరువాత మా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. మా అంచనాల ప్రకారం మహా కూటమికి కనీసం 80 సీట్లు వస్తాయని భావిస్తున్నాము. తెరాసకు కేవలం 20 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదు. తెరాస గ్రాఫ్ రోజురోజుకూ వేగంగా పడిపోతోంది. సిఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకొన్నాక ఇంకా వేగంగా పడిపోతోంది. తెరాసకు ఇక సమయం దగ్గర పడింది. ఆ పార్టీలో చాలా మంది ముఖ్య నేతలు మాతో టచ్చులో ఉన్నారు. వారందరూ త్వరలోనే మా పార్టీలోకి రాబోతున్నారు,” అని అన్నారు. 

తెరాస-బిజెపిల రహస్య బందం గురించి మాట్లాడుతూ, “బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో సభ నిర్వహించి తెరాసను తిట్టిపోయడం, మళ్ళీ తెరాస నేతలు ప్రతివిమర్శలు గుప్పించడం అంతా పెద్ద డ్రామా. సిఎం కేసీఆర్‌, అమిత్ షా ఇద్దరూ కలిసి ఇటువంటి డ్రామాలతో ప్రజలను మోసం చేయాలనుకొంటున్నారు. కానీ వారి డ్రామాను ప్రజలు అర్ధం చేసుకోలేరనుకోవడం అవివేకం. త్వరలోనే రాహుల్ గాంధీ, సోనియాగాంధీలు తెలంగాణలో వరుసగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తారు,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

ఈసారి ఎన్నికలలో తెరాస 110 సీట్లు గెలుచుకొంటుందని, కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్షహోదా దక్కించుకొంటే చాలని తిప్పలు పడుతోందని తెరాస వాడిస్తుంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి 80, తెరాసకు 20 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పడం విశేషం. 


Related Post