నాయిని మాటలపై రేవంత్‌ స్పందన

October 12, 2018


img

తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి తనకు లేదా తన అల్లుడికి ముషీరాబాద్ టికెట్ ఇవ్వాలని తాను సిఎం కేసీఆర్‌ను కోరగా, ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసేమాటయితే ఎన్నికల ఖర్చుల కోసం రూ.10 కోట్లు ఇస్తానని చెప్పారని నాయిని అన్న మాటలను కాంగ్రెస్ నేతలు ఎవరూ పట్టించుకోలేదు కానీ రేవంత్‌రెడ్డి టక్కున పట్టేశారు. 

దానిపై స్పందిస్తూ, “ఈ ఎన్నికలలో డబ్బులు వెదజల్లి గెలవాలని సిఎం కేసీఆర్‌ సిద్దంగా ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏముంటుంది. ఎన్నికలలో ఒక్కో అభ్యర్ధి గరిష్టంగా రూ.28 లక్షలు ఖర్చుపెట్టుకోవడానికి ఎన్నికల సంఘం అనుమతిస్తే తెరాస రూ.10 కోట్లు ఖర్చు చేయబోతోందని స్పష్టమయింది. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్వయంగా చెప్పిన ఈ మాటలను సుమోటోగా స్వీకరించి సిఎం కేసీఆర్‌పై చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని మేము ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ ను డిమాండ్ చేస్తున్నాము. ఉద్యమాలలో సిఎం కేసీఆర్‌ వెన్నంటి ఉన్న నాయినికి ఇంతవరకు టికెట్ ఇవ్వకపోవడం అవమానకరమే. అంత సీనియర్ నేత టికెట్ కోసం సిఎం కేసీఆర్‌ను ప్రాధేయపడవలసిరావడం సిగ్గు చేటు. కొడంగల్ నియోజకవర్గంలో నన్ను ఓడించేందుకు సిఎం కేసీఆర్‌ రూ.100 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు నాకు తెలిసింది. ఎన్నికలలో ఖర్చు చేయడానికి ఇన్ని వందల కోట్లు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాయంటే సాగునీటి ప్రాజెక్టులలో అక్రమార్జనే. కనుక ఐ‌టి అధికారులు ముందుగా ప్రగతిభవన్‌లో, కేటిఆర్‌, కవిత, హరీష్ రావు ఇళ్ళలో సోదాలు నిర్వహించాలని మేము కోరుతున్నాము,” అని రేవంత్‌రెడ్డి అన్నారు.


Related Post