విమానం వెళ్తోంది జర భద్రం!

October 12, 2018


img

అవును. ఇప్పుడు రైళ్ళు, బస్సులు, లారీలు మాత్రమే కాదు రోడ్డుపై వెళుతుంటే విమానాలు కూడా మిమ్మల్ని డ్డీకొనే ప్రమాదం ఉంది. ఎలాగంటారా... అయితే తిరుచ్చి విమానాశ్రయంలో జరిగిన ఈ స్టోరీ వినాల్సిందే. 

తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయం నుంచి గురువారం అర్ధరాతి ఎయిర్ ఇండియా విమానం దుబాయ్ బయలుదేరింది. దానిలో ఆరుగురు సిబ్బంది, 130 మండి ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన తరువాత గాలిలోకి లేస్తున్నప్పుడు, కనీసం 100-200 మీటర్ల ఎత్తుకు చేరుకోవాలి. కానీ ఎయిర్ ఇండియా  విమానం వెనుక చక్రాలు రన్-వే చివర ఉండే ప్రహారీగోడకుతగిలాయి. అంటే ఆ సమయంలో అది ఎంత ఎత్తులో ఎగురుతోందో తలుచుకొంటే ఒళ్ళు జలదరిస్తుంది.

వెనుక చక్రాలు తాకడంతో ఆ గోడ కూలిపోయింది. కనుక విమానంలో పెద్ద కుదుపు వచ్చే ఉంటుంది. కానీ విమాన పైలట్ ఏమాత్రం కంగారు పడకుండా విమానాన్ని వెనక్కు తిప్పే ఆలోచన చేయకుండా అలాగే ముంబైకి తీసుకుపోయి అక్కడ జాగ్రత్తగా ల్యాండ్ చేశాడు. విమానం గోడను డ్డీ కొన్న తరువాత కాసేపు విమానానికి-ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోవడంతో తిరుచ్చి విమానాశ్రయ అధికారులు చాలా కంగారుపడ్డారు. విమానం ఆకాశంలో స్థిరంగా పయనించడం మొదలుపెట్టాక మళ్ళీ సిగ్నల్స్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.

ముంబైలో విమానం దిగిన తరువాత దానిలో ప్రయాణికులందరినీ వేరే విమానంలో దుబాయ్ కి పంపించేరు ఎయిర్ ఇండియా అధికారులు. ఈ ప్రమాదానికి కారణాలను తెలుసుకొనేందుకు తక్షణం దర్యాప్తు మొదలుపెట్టారు.

కనుక ఈసారి మీరు రోడ్డుపై కారులోనో బైకు మీదో వెళుతున్నప్పుడు కాస్త ముందూ వెనుక చూసుకోండి విమానాలు ఏమైనా వస్తున్నాయేమోనని.


Related Post