టిడిపి ఎంపీ సిఎం రమేష్ ఇళ్ళు, కార్యాలపై ఐ‌టి దాడులు

October 12, 2018


img

టిడిపి ఎంపి సిఎం రమేశ్ ఇళ్ళు, కార్యాలయాలపై ఆదాయపన్ను అధికారులు ఈరోజు ఉదయం నుంచి దాడులు జరుపుతున్నారు. ఈ సోదాలలో కమీషనర్ స్థాయి అధికారులు 15 మందితో కలిపి మొత్తం 100 మంది ఐ‌టి అధికారులు హైదారాబాద్ కార్యాలయంలో, కడప జిల్లాలో పోట్లదుర్తిలోని ఆయన నివాసంతో కలిపి 25-30 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డిల్లీలో ఉన్న ఆయన దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నందునే తనపై కక్ష కట్టి ఐ‌టి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. అయితే తానేమీ చట్ట వ్యతిరేకమైన పనులు చేయడం లేదని, ఎప్పటికప్పుడు ఆదాయపన్ను చెల్లిస్తున్నానని కనుక ఈ దాడులకు తానేమీ భయపడవలసిన అవసరం లేదని అన్నారు. టిడిపి నేతలను లక్ష్యంగా చేసుకొని ఐ‌టి దాడులు చేయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే కేంద్రం బెదిరింపులకు లొంగి తమ పోరాటాలు నిలిపివేయబోమని సిఎం రమేష్ అన్నారు.  

టిడిపి నేతలు కూడా ఈసోదాలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేంద్ర ప్రభుత్వం టిడిపి నేతలపై ఈవిధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు.    

టిడిపి అవినీతిని ప్రశ్నిస్తున్న సాక్షి మీడియా ఈ ఐ‌టి దాడులపై భిన్నంగా స్పందించింది. సిఎం రమేష్ కు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు ఏపీ ప్రభుత్వం  అనేక ప్రాజెక్టులను కట్టబెట్టిందని, వాటిలో ఆయనకు అక్రమంగా వందల కోట్లు లభ్ది పొందారని పేర్కొంది. ఆయన టిడిపి ఎంపీ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రాజెక్టు అంచనా వ్యయాలను బారీగా పెంచి ఆయనకు లబ్ధి కలిగేలా చేశారని సాక్షి మీడియా పేర్కొంది. అందుకే ఐ‌టి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని సాక్షి మీడియా పేర్కొంది. 



Related Post