భార్యకే నచ్చకపోతే ఇక ప్రజలకేమి నచ్చుతుంది? హరీష్

October 12, 2018


img

పద్మినీ రెడ్డి బిజెపిలో చేరికను మంత్రి హరీష్ రావు చాలా చక్కగా ఉపయోగించుకొన్నారు. నిన్న సంగారెడ్డి జిల్లాలో రాయికోడ్ లో ఆంధోల్ నియోజకవర్గం పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, “నేను ఇక్కడికి వస్తుంటే దారిలో ఒక మెసేజ్ వచ్చింది. కాంగ్రెస్ నాయకుడు దామోదర్‌ రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డిగారు బిజెపిలో చేరారని. దామోదర్‌ రాజనర్సింహ ఎవరు? కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తుందో తెలియజేసే మేనిఫెస్టోను తయారుచేస్తున్నారు. అయితే ఆయన తయారుచేస్తున్న మేనిఫెస్టో ఆయన భార్యకె నచ్చక బిజెపిలో చేరిపోతే ఇక ప్రజలకేమి నచ్చుతుంది? ఆయన కుటుంబసభ్యులకే నచ్చ చెప్పుకోలేకపోతే ఇక ప్రజలకేవిధంగా నచ్చచెప్పగలరు?ప్రజలు ఏమనుకొంటున్నారో తెలుసుకోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే ఆ పార్టీలో నేతలు బయటకు వెళ్లిపోతున్నారు. 

“రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, వాస్తవానికి ప్రతిపక్షహోదా అయినా లభిస్తే చాలని కోరుకొంటున్నారు. అది దక్కించుకోవడం కోసమే వారు టిడిపి, టిజేఎస్, సిపిఐ పార్టీలతో పొత్తులకు సిద్దపడ్డారు. నేను అడిగిన 12 ప్రశ్నలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా సమాధానం ఇవ్వలేక డొంక తిరుగుడుగా ఏదో మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకి బానిస మనస్తత్వం ఉంది. అందుకే వారు ఎప్పుడూ పరాయివాళ్ళ కోసం పనిచేస్తుంటారు. మేము రాష్ట్రంలో రైతులకు మేలు చేసేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని బంద్ చేయిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ఇపుడే చెపుతున్నారు. ఇది ఆయన స్వంత ఆలోచనా లేక కాంగ్రెస్ పార్టీ నిర్ణయమేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలి,” అని మంత్రి హరీష్ రావు అన్నారు.


Related Post