ఏపీని వణికిస్తున్న తితిలీ

October 11, 2018


img

ఏపీకి సువిశాలమైన సముద్రతీరమే గొప్ప వరం. అదే అప్పుడప్పుడు శాపంగా కూడా మారుతుంటుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. తితిలీ తుఫాను ఈరోజు ఉదయం శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలంలోని గొల్లపాడు-పల్లె సారధి గ్రామాల వద్ద తీరం దాటింది. అందువల్ల జిల్లా వ్యాప్తంగా గంటకు 80-120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులలతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలుల ధాటికి అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ముందస్తు జాగ్రత్తగా ఈరోజు ఉదయం నుంచి శ్రీకాకుళం జిల్లాలో పలుప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మత్స్యకారులను సముద్రంలో వెళ్ళవద్దని అధికారులు పదేపదే హెచ్చరికలు జారీ చేయడంతో మత్స్యకారులు అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు.

సముద్రతీర ప్రాంతాలలో నివసిస్తున్న వేలాదిమంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీకాకుళం, భీమిలి, విశాఖలో సముద్రతీరాలలో ప్రమాదహెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను సముద్రతీరాలవైపు వెళ్లకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. రెండుమూడు రోజుల ముందుగానే వాతావరణ శాఖ అధికారులు తితిలీ తుఫాను రాక గురించి హెచ్చరించినందున ఏపీ ప్రభుత్వం అన్నీ ముందస్తు జాగ్రతలు, ఏర్పాట్లు చేసుకోగలిగింది. తితిలీ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సహాచర్యలు చేపట్టేందుకు అమరావతి, శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికి అప్పుడు సమీక్షిస్తూ అధికారులు అవసరమైన చర్యలు తీసుకొంటున్నారు. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం హెలికాఫ్టరులో శ్రీకాకుళం చేరుకొని రాత్రికి అక్కడే బస చేసి తుఫాను సహాయా చర్యలను పర్యవేక్షిస్తారు. తితిలీ తుఫాను ప్రభావం ఈరోజు సాయంత్రం వరకు ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.


Related Post