ఎందుకీ కేసులు? ప్రజాకోర్టులో తేల్చుకుందామంటే... కేటిఆర్‌

October 11, 2018


img

మంత్రి కేటిఆర్‌ నిన్న తెలంగాణభవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “సిఎం కెసిఆర్ రైతుబిడ్డ అందుకే రైతుల కష్టాలను తీర్చేందుకు సాగునీటి ప్రాజెక్టులను నిర్మింపజేస్తున్నారు. రైతుబంధు, రైతుభీమా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలుచేస్తున్నారు. రైతులకు మేలు చేసే ఆ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కాంగ్రెస్ నేతలు కోర్టులలో కేసులు వేశారు.... వాటిని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు వ్రాశారు. కాంగ్రెస్ పార్టీతో ఈ కేసులు, కోర్టులు, పంచాయితీలు ఎందుకని ప్రజాకోర్టులోనే తేల్చుకొందామనే ఉద్దేశ్యంతోనే మేము మా అధికారాన్ని, ప్రభుత్వాన్ని త్యాగం చేసి ఎన్నికలకు వెళుతుంటే, కాంగ్రెస్ నేతలు ఆ ఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడుతూ మళ్ళీ వాటిపై కూడా కోర్టులకు వెళ్ళి భంగపడుతున్నారు.  

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు తమలాగే తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడుతున్న చంద్రబాబునాయుడుతో చేతులు కలిపి మహా కూటమి ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ మహా కూటమి గెలిస్తే, చంద్రబాబునాయుడు మన ప్రాజెక్టులను కట్టనిస్తాడా?మనకు డిల్లీ అమరావతి గులాముల పాలన కావాలో లేక స్వపరిపాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. నాలుగున్నరేళ్ళలో మేము రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి చేయగలిగినంతా చేశాము. మేము చేసిన ఆ అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు నచ్చినట్లయితే మమ్మల్ని ఆశీర్వదించమని ప్రజలను కోరుతున్నాను,” అని అన్నారు.


Related Post