ఓటర్ల జాబితా కేసులో కొత్త మలుపు

October 11, 2018


img

ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటిషనుపై బుదవారం విచారణ జరిపిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత రేపు అంటే శుక్రవారం ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు ఎన్నికల సంఘాన్ని అనుమతించింది. 

దీనిపై శశిధర్ రెడ్డి తరపునా వాదించిన న్యాయవాది ఓటర్ల జాబితాలో కొత్తగా పుట్టిన శిశువులను, పోలీస్ ఎన్ కౌంటరులో చనిపోయిన తీవ్రవాది వికారుద్దీన్ వంటివారి పేర్లు నమోదు చేయబడ్డాయని, అటువంటివి సుమారు 68 లక్షల బోగస్ ఓట్లు నమోదు అయ్యాయని, అదేసమయంలో అర్హులైన లక్షలాది ఓటర్ల పేర్లు జాబితాలో నుంచి మాయం అయ్యాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

ఎన్నికల సంఘం తరపున వాదించిన న్యాయవాది, ఓటర్ల జాబితా సవరణలు అనేవి ఒక నిరంతర ప్రక్రియ అని వాటికి ఎన్నికలతో సంబందం లేదని వాదించారు. నవంబర్ 19న నామినేషన్లు వేసే రోజున మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పారు. తుది జాబితా చూడకుండా దాని తప్పొప్పులపై వాదించడం సరికాదన్నారు. ఆయన వాదనలతో ఏకీభవించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఓటర్ల జాబితా ప్రచురణపై ఇంతకు ముందు హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఓటర్ల జాబితా ప్రచురణ, సవరణలు పూర్తి పారదర్శకంగా ఉండాలని ఆదేశిస్తూ ఈ కేసును రేపటికి వాయిదా వేసింది.


Related Post