హరీష్ రావుకు ధన్యవాదాలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

October 11, 2018


img

మంత్రి హరీష్ రావు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి 12 ప్రశ్నలతో కూడిన ఒక బహిరంగ లేఖ వ్రాయగా దానికి ఆయన కూడా లేఖరూపంలోనే బదులిచ్చారు. సిఎం కెసిఆర్ కు వ్రాసిన ఆ బహిరంగ లేఖలో ముందుగా మంత్రి హరీష్ రావుకు, తెరాసకు కృతజ్నతలు తెలుపుకోవడం విశేషం. 

ఆ లేఖ సారాంశం ఏమిటంటే “తెరాస ఓటమి, కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని మంత్రి హరీష్ రావు వ్రాసిన లేఖ ద్వారా దృవీకరించినట్లు భావిస్తున్నాము. అందుకు కృతజ్నతలు తెలుపుకొంటున్నాము. తెరాస 100 సీట్లు గెలుచుకోవడం కల చెదిరిపోయినట్లు మంత్రి హరీష్ రావు లేఖ ద్వారా అర్ధం అవుతోంది. అందుకే మా పొత్తులను చూసి తెరాస అంతగా భయపడుతోంది. ఒక రాజకీయ పార్టీగా మేము ఎవరితో పొత్తులు పెట్టుకొంటే మీకెందుకు? మా పొత్తులు చూసి మీరేందుకు భయపడుతున్నారు?

అమరావతి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంట్లో చేపల పులుసు తిని వచ్చినప్పుడు, చండీయాగానికి చంద్రబాబు నాయుడును ఆహ్వానించి సన్మానం చేసినప్పుడు ఆయనలో ఇప్పుడు మీరు చెపుతున్న ఈ తప్పులన్నీ కనిపించలేదా? ఏపీ మంత్రి పరిటాల సునీత కొడుకు పెళ్ళికి వెళ్లినప్పుడు టిడిపి నేతతో రహస్యంగా మంతనాలు జరుపలేదా? అప్పుడు లేని తప్పులు ఇప్పుడు మేము టిడిపితో పొత్తులు పెట్టుకొంటే కనబడుతున్నాయా?ఏడు మండలాలను చంద్రబాబు నాయుడు ఏపీలో విలీనం చేయించుకొంటుంటే మీరెందుకు చేతులు ముడుచుకొని కూర్చోన్నారు? అప్పుడే ఎందుకు అడ్డుకోలేదు? తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు లేఖలు వ్రాస్తుంటే అధికారంలో ఉన్న మీరేమి చేస్తున్నారు? 

మోడీ భజనలో తరించిపోతున్న మీరు మీ చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికే ఇతరులపై నిందలు వేస్తున్నారు. తెలంగాణలో నిరంకుశ పాలన అంతమొందించి ప్రజాస్వామ్య పాలన తీసుకు రావడానికే ప్రతిపక్ష పార్టీలు ఏకం అవుతుంటే వాటి ఐఖ్యతను చూసి భయంతో వణికిపోతూ మహా కూటమి గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. మహాకూటమి చేతిలో తెరాస ఓటమి తప్పదని మీకు ఈపాటికి అర్ధం అయ్యే ఉంటుందని భావిస్తున్నాను.”


Related Post