కేసీఆర్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు

October 10, 2018


img

ఈరోజు కరీంనగర్ బహిరంగసభలో పాల్గొనడానికి హైదారాబాద్ వచ్చిన అమిత్ షా, మీడియాతో మాట్లాడుతూ, “మోడీ ప్రభంజనంలో కొట్టుకుపోతాననే భయంతోనే సిఎం కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు. ఈ ఎన్నికలలో గెలిచినట్లయితే తన కొడుకునో, కూతురినో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని కేసీఆర్‌ కలలు కంటున్నారు. కానీ అవి నేరవు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వంపై నిత్యం బురదజల్లుతూ బిజెపి పట్ల రాష్ట్ర ప్రజలలో వ్యతిరేకత కలిగించాలని సిఎం కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్ళలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సుమారు రూ.1.15 లక్షల కోట్లు ఇచ్చింది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలకే రూ.40,000 ఇచ్చిన మాట వాస్తవమా కదా? తెలంగాణకు ఇంతగా సాయం చేస్తున్నా మేము రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు. జమిలి ఎన్నికలకు సిద్దమని చెప్పిన ఆయన ఇప్పుడు హడావుడిగా ముందస్తు ఎన్నికలకు వెళుతూ రాష్ట్రంపై భారీగా ఆర్ధికభారం మోపారు,” అని విమర్శించారు.

సిఎం కెసిఆర్ తన కొడుకునో కూతురినో ముఖ్యమంత్రి చేయదలచుకొంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళవలసిన అవసరం ఉందా? అంటే కాదనే అర్ధమవుతుంది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాటిలో తెరాస గెలిస్తే కెసిఆర్ మళ్ళీ ఆ పదవి చేపట్టవచ్చు లేదా కేటిఆర్‌ లేదా మరెవరికైనా ఆ పదవిని అప్పగించవచ్చు. కనుక ముందస్తు ఎన్నికలకు, ముఖ్యమంత్రి పదవికి సంబందమే లేదని చెప్పవచ్చు. 

ఇక మోడీ ప్రభంజనం చూసి భయపడి సిఎం కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని అమిత్ షా చెప్పడం కూడా హాస్యాస్పదంగానే ఉంది. ఎందుకంటే, దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అందరికీ తెలుసు. మోడీ స్వయంగా ప్రచారం చేసినా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ప్రజలు బిజెపిని పట్టించుకోలేదు. రేపు తెలంగాణలో కూడా అదే జరుగుతుందని భావించవచ్చు. అయితే లోక్ సభ ఎన్నికలతో పాతు శాసనసభ ఎన్నికలు నిర్వహించినట్లయితే, జాతీయ అంశాలపై కాంగ్రెస్, బిజెపిలు వాధోపవాదాలు చేసుకొంటే, కాంగ్రెస్ ఎంతో కొంత లాభపడితే తెరాస నష్టపోతుందనే ఆలోచనతోనే సిఎం కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఉండవచ్చు.     

ఇక ముందస్తు ఎన్నికల వలన తెలంగాణపై చాలా ఆర్ధికభారం పడుతున్నమాట వాస్తవమే. ఆవిధంగా జరగకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకొనే అవకాశం ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కనుక ఈ తప్పులో తెరాస, బిజెపిలు రెంటికీ సమాన బాధ్యత ఉందని చెప్పకతప్పదు.


Related Post