రాహుల్ గాంధీ ఆరోపణలే నిజమయ్యాయా?

August 22, 2018


img

రాఫెల్ యుద్దవిమానాల కొనుగోలులో ప్రధాని మోడీ స్వయంగా అంబానీలకు వేలకోట్లు లబ్ధి కలిగేవిధంగా తెరచాటున కధ నడిపారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదేపదే ఆరోపణలు చేస్తుండటం, వాటిని బిజెపి నేతలు త్రిప్పి కొడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీ ఆరోపణలకు బలం చేకూరేవిధంగా ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు  ఫ్రాన్స్‌వో హోలన్‌ చేసిన ఒక తాజా ప్రకటన ఉంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థతోనే రాఫెల్ యుద్దవిమానాల కాంట్రాక్టును కుదుర్చుకోవాలని భారత ప్రభుత్వం డసో ఏవియేషన్ సంస్థకు సూచించిందని తమకు వేరే ప్రత్యామ్నాయం లేనందునే భారత ప్రభుత్వం చెప్పినట్లుగా రిలయన్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవలసి వచ్చిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు  ఫ్రాన్స్‌వో హోలన్‌ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలోనే ప్రధాని మోడీ ఫ్రాన్స్ వెళ్ళి,  2015 ఏప్రిల్‌ 10న పారిస్ లో 36 రాఫెల్ యుద్ధవిమానాలు కొనుగోలు చేయబోతునట్లు ప్రకటించారు. కనుక ఫ్రాన్స్‌వో హోలన్‌ చేసిన ఈ తాజా ప్రకటన భారత రాజకీయాలలో అప్పుడే ప్రకంపనలు పుట్టిస్తోంది. 

విమానాల తయారీలో అపారమైన అనుభవమున్న భారత ప్రభుత్వరంగసంస్థ హిందూస్థాన్ ఏరో నాటికల్ (హాల్)ను పక్కన పెట్టి, ఏనాడూ ఒక్క విమానం కూడా తయారు చేయని రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు ఎందుకు ఈ కాంట్రాక్టు దక్కేలా చేశారని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. ఫ్రాన్స్ పత్రికలో ప్రచురితమైన ఈ సంచలన వార్తతో కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాల నేతలు మోడీ సర్కారుపై అప్పుడే మళ్ళీ విమర్శలు కురిపిస్తున్నారు.


Related Post