కశ్మీరులో పరిస్థితి చెయ్యి దాటిపోతోందా?

September 21, 2018


img

జమ్ము&కశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితి చెయ్యి దాటిపోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే. రాష్ట్రంలో పోలీసులు, పోలీస్ అధికారులు అందరూ తక్షణం తమ పదవులకు రాజీనామాలు చేయాలని లేకుంటే అందరినీ హతమారుస్తామంటూ హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాదులు రెండు రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేశారు. కానీ వారి హెచ్చరికలను ఎవరూ ఖాతరు చేయకపోవడంతో పోషియాన్ జిల్లాలో ముగ్గురు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి అతి దారుణంగా హత్య చేసి రోడ్లపై పడేశారు. ఇప్పటికీ తమ హెచ్చరికలను ఖాతరు చేయనివారికి ఇదే గతి పడుతుందని మళ్ళీ హెచ్చరికలు జారీ చేశారు. దాంతో భయపడిన నలుగురుస్పెషల్ పోలీస్ ఆఫీసర్లు, ఒక కానిస్టేబుల్ శుక్రవారం తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారని సమాచారం. కానీ పోలీసులు ఎవరూ రాజీనామాలు చేయలేదని, ప్రజలను భయబ్రాంతులు చేసేందుకే వ్యాపింప జేస్తున్న అటువంటి పుకార్లను  ఎవరూ నమ్మవద్దని ఆ రాష్ట్ర డిజిపి ప్రజలకు విజ్నప్తి చేశారు . ఒకవేళ ఉగ్రవాదుల కిడ్నాపులకు, హత్యలకు భయపడి రాష్ట్రంలో పోలీసులు, భద్రత సిబ్బంది నిజంగానే తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేయడం మొదలుపెడితే అప్పుడు జమ్ము&కశ్మీర్ రాష్ట్రం పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. పరిస్థితి అంతవరకు రాకమునుపే కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేయడానికి గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. 


Related Post