సిఎం అయినా చట్టానికి అతీతులు కారు: ధర్మాబాద్ కోర్టు

August 21, 2018


img

ఈరోజు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టులో బాబ్లీ ప్రాజెక్టు కేసుపై విచారణ జరిగింది. ఈ కేసులో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో మొత్తం 16మందికి ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ చంద్రబాబు తరపున సుబ్బారావు అనే న్యాయవాది హాజరయ్యి ఈ కేసును వాదించారు. 

ఈ కేసుకు సంబందించి నోటీసులు ఎన్నడూ తమకు అందలేదని, మీడియాలో వచ్చిన వార్తలను చూసి న్యాయస్థానంపట్ల గౌరవంతోనే తాము చంద్రబాబు తరపున విచరణకు హాజరయ్యామని చెప్పారు. మిగిలినవారికి కోర్టు పంపిన నోటీసులు మరాఠీ బాషలో ఉన్నందున తమకు అర్ధం కాలేదని కనుక వాటిని తెలుగు లేదా ఇంగ్లీష్ బాషలో తర్జుమా చేసి పంపవలసిందిగా సుబ్బారావు న్యాయమూర్తిని కోరారు. ఈ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేయబడిన చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గౌరవనీయమైన పదవిలో ఉన్నారు కనుక ఆయనకు జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటును వెనక్కు తీసుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్ధించారు. 

టిడిపి నేతల తరపు వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి స్పందిస్తూ, “రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చట్టానికి అతీతులు కారు. చంద్రబాబు నాయుడుతో సహా అందరూ కోర్టులో విచారణకు హాజరు కావలసిందే. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేస్తున్నాము. ఆ రోజున చంద్రబాబు నాయుడు కూడా తప్పనిసరిగా హాజరుకావాలి,” అని ఆదేశించారు.  

ఈరోజు విచారణకు మాజీ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, గంగుల కరుణాకర్, కె.ఎస్. రత్నం హాజరయ్యారు.వారు ముగ్గురికీ న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. చంద్రబాబు నాయుడు అక్టోబర్ 15న కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి స్పష్టంగా చెప్పినందున, ఆయన హైకోర్టు లేదా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారేమో?


Related Post