కెసిఆర్‌ సెల్ఫ్ గోల్ చేసుకొన్నారు: ఉత్తమ్

September 18, 2018


img

టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రముఖ తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో విలేఖరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, “ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే 100కు పైగా సీట్లు గెలుస్తామనే భ్రమలో సిఎం కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలను తెచ్చుకొని సెల్ఫ్ గోల్ చేసుకొన్నారని మేము భావిస్తున్నాను. కెసిఆర్‌ ఊహాలోకంలో విహరిస్తూ చేజేతులా తన ప్రభుత్వాన్ని తానే కూల్చుకొన్నారు. కానీ మాకున్న సమాచారం ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 70-75 సీట్లు లభిస్తాయి. కూటమిగా ముందుకు సాగితే మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయి. కనుక ఈ ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో మేమే అధికారంలోకి రావడం ఖాయం,” అని చెప్పారు. 

“కెసిఆర్‌ను ఎందుకు దింపాలి? కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలి?” అనే ప్రశ్నలకు సమాధానంగా, “తెలంగాణా ఏర్పడింది రాష్ట్ర ప్రజల కోసమే కానీ కెసిఆర్‌ కుటుంబం కోసం కాదు. కానీ ఆయన ప్రజలకు మాయమాటలు చెపుతూ మోసం చేస్తున్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఈ నాలుగేళ్ళలో రాష్ట్రంలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. అంతమంది రైతులు చనిపోతున్నా సిఎం కెసిఆర్‌కు చీమకుట్టినట్లు లేదు. ఈ నాలుగేళ్ళలో వారిలో కనీసం ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించలేదు. ఇక తనను ప్రశ్నిస్తున్న ప్రజాస్వామ్య సంఘాల నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య సంస్థలను అణచివేస్తున్నారు. మిగులు నిధులతో చేతికి వచ్చిన తెలంగాణా రాష్ట్రాన్ని అప్పులలో కూరుకుపోయేలా చేశారు. మద్యం అమ్మకాలలో మాత్రం రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలిపగలిగారు. అందుకే కెసిఆర్‌ను తక్షణమే గద్దె దించాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు. 

“కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటువేయాలంటే, మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను, ప్రజలందరినీ గౌరవిస్తుంది. అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆధరిస్తుంది,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 


Related Post