కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితా ఇంకా ఎప్పుడో?

September 17, 2018


img

టిఆర్ఎస్‌ తన 105 మంది అభ్యర్ధుల జాబితాను సెప్టెంబరు 7న ప్రకటించింది. అంటే నేటికి 10 రోజులయ్యిందన్న మాట. టిఆర్ఎస్‌ అభ్యర్ధులు తమ తమ నియోజకవర్గాలలో అప్పుడే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. కానీ రాష్ట్రంలో ఒక్క మజ్లీస్ తప్ప ప్రతిపక్షపార్టీలు ఏవీ ఇంతవరకు తమ అభ్యర్ధులను ప్రకటించలేదు. కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ, టిజేఎస్ పార్టీలు ఎన్నికల పొత్తులు పెట్టుకోబోతున్నాయి కనుక వాటి మద్య సీట్ల సర్ధుబాట్ల ప్రక్రియ పూర్తయితే కానీ ఆ నాలుగు పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇంకా కమిటీల ఏర్పాటు ప్రక్రియ కూడా పూర్తి కాలేదు కనుక ఎన్నికల ప్రచారం మొదలుపెట్టలేకపోతోంది. 

ఈ పరిస్థితిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరణ ఇస్తూ, “మా నాలుగు పార్టీలు పొత్తులు పెట్టుకోవాలని అంగీకరించినందున, ఉమ్మడి అజెండా, కూటమి నాయకత్వం అంశాలపై ప్రస్తుతం చర్చిస్తున్నాము. అవి పూర్తయిన తరువాత సీట్ల సర్ధుబాట్లపై చర్చలు మొదలవుతాయి. అయితే కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తోంది. మాకు బలమైన అభ్యర్ధులున్న చోట్ల, విజయావకాశాలున్న చోట్ల మేమే పోటీ చేస్తాము. పొత్తుల కోసం వాటిని వదులుకోము. త్వరలోనే కాంగ్రెస్‌ కమిటీలు ఏర్పాటవుతాయి,” అని చెప్పారు. 

ఆ నాలుగు పార్టీలకు అభ్యర్ధులను ప్రకటించడంలో ఉన్న సమస్య అర్ధమవుతూనే ఉంది. కానీ టిఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని, టిఆర్ఎస్‌ను ఒంటరిగా పోటీ చేసి ఓడించబోతున్నామని గొప్పలు చెప్పుకొంటున్న బిజెపి ఇంతవరకు ఒక్క అభ్యర్ధి పేరు కూడా ప్రకటించలేకపోయింది. కెసిఆర్‌ చెప్పినట్లు ఒకవేళ అక్టోబరు మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ప్రతిపక్షాలకు ఇక అట్టే సమయం మిగలదు. 


Related Post