ఎర్రబెల్లికి తప్పలేదు అసమ్మతి సెగ

September 15, 2018


img

టిఆర్ఎస్‌ మొదటి జాబితాలోనే పాలకుర్తి నుంచి టికెట్ సంపాదించుకొన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు అసమ్మతి సెగలు తగులుతున్నాయి. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్‌ అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్ రావు నుంచి  ఎర్రబెల్లికి సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఈరోజు ఆయన వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ, “ఎర్రబెల్లికి దమ్ము ధైర్యం ఉంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖపై పోటీ చేసి గెలిచి తన సత్తా చూపాలి అని సవాలు విసురుతున్నాను. నేను పాలకుర్తి నుంచి పోటీ చేయాలని టిఆర్ఎస్‌ కార్యకర్తలు అందరూ కోరుకొంటున్నారు. వారి కోరిక మేరకే నేను పాలకుర్తి నుంచి పోటీ చేయాలనుకొంటున్నాను. కనుక ఎర్రబెల్లి స్థానంలో నాకు టికెట్ కేటాయించాలని సిఎం కెసిఆర్‌కు విజ్నప్తి చేస్తున్నాను. ఒకవేళ నాకు టికెట్ కేటాయించకపోతే నా అనుచరులతో చర్చించుకొని తగిన నిర్ణయం తీసుకొంటాను,” అని చెప్పారు. 

చెన్నూరు సిటింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు స్థానంలో బాల్క సుమన్ కు టికెట్ కేటాయించినప్పుడు ఓదేలు కూడా ఇలాగే చాలా హడావుడి చేశారు. కానీ సిఎం కెసిఆర్‌తో మాట్లాడినా తరువాత చల్లబడిపోయారు. బహుశః తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, విషయంలో కూడా అలాగే జరుగుతుందేమో?      

ఇంకా స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి రాజయ్య, వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, మహేశ్వరం నుంచి తీగల కృష్ణారెడ్డి కూడా అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఈ అసమ్మతినేతలందరినీ బుజ్జగించి, మిగిలిన 14 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించిన తరువాతే  సిఎం కెసిఆర్‌ ఎన్నికల ప్రచారసభలకు బయలుదేరే అవకాశం ఉంది.


Related Post