నేటి నుంచి బిజెపి ఎన్నికల ప్రచారం షురూ

September 15, 2018


img

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేందుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు హైదరాబాద్‌ రాబోతున్నారు. ఆయన ఈరోజు ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొంటారు. మధ్యాహ్నం భోజన సమయం వరకు పార్టీ కార్యక్రమాలలో పాల్గొని భోజనాంతరం కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని కారులో మహబూబ్ నగర్ చేరుకొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బిజెపి నిర్వహించబోయే మొట్టమొదటి బహిరంగసభలో ప్రసంగిస్తారు. 

రాష్ట్రంలో బిజెపికి మహబూబ్‌నగర్‌లో మంచి పట్టు ఉండటంతో అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తోంది. ఇది తొలిసభ కావడంతో కనీసం లక్షమందిని జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయడానికి బిజెపి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 

సిఎం కెసిఆర్‌-ప్రధాని మోడీ, అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మద్య బలమైన స్నేహసంబంధాలు నెలకొని ఉన్నందున టిఆర్ఎస్‌-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆ కారణంగా టిఆర్ఎస్‌ సర్కారుపై రాష్ట్ర బిజెపి నేతలు చేస్తున్న విమర్శలకు విలువలేకుండాపోతోంది. అదే కారణంగా బిజెపి ప్రజల నమ్మకం పొందలేకపోతోంది. ఈ నేపద్యంలో రాష్ట్రంలో తొలి ఎన్నికలసభలో ప్రసంగించనున్న అమిత్ షా ఆ అనుమానాలను తొలగించేందుకు ఏమి చెపుతారో? ప్రజల నమ్మకం పొందేందుకు ఏమి చేస్తారో? టిఆర్ఎస్‌ ధాటికి బలహీనపడిన బిజెపికి ఎటువంటి వైద్యం చేస్తారో చూడాలి. 


Related Post