టిఆర్ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయం కానీ....

September 14, 2018


img

తెలంగాణా బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “అధికార దాహంతో కాంగ్రెస్‌-టిడిపిలు అనైతికపొత్తులు పెట్టుకొంటున్నప్పటికీ రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు బిజెపి మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయం. ఒకప్పుడు ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ టిడిపిని ఏర్పాటు చేశారు. దానిని గద్దె దించేందుకు ఆయన దేశమంతా తిరిగి ఫ్రంట్ ఏర్పాటు చేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే కాంగ్రెస్ పార్టీతో నిసిగ్గుగా పొత్తులు పెట్టుకొని దానిని గద్దెనెక్కించడానికి ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు. వాటి అనైతిక పొత్తులను ప్రజలు ఆమోదిస్తారని నేను భావించడం లేదు. అదేవిధంగా రాష్ట్రంలో టిఆర్ఎస్‌ మజ్లీస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని దాని కనుసన్నలలో పనిచేస్తోంది. కనుక టిఆర్ఎస్‌కు ఓటేస్తే మజ్లీస్ పార్టీకి ఓటేసినట్లే. వాటి పొత్తులను రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు,” అని అన్నారు. 

ఈ సందర్భంగా ఒక విలేఖరి “మీరు అన్ని స్థానాలకు పోటీ చేస్తామని చెపున్నారు కదా? అంతమంది అభ్యర్ధులు మీ పార్టీలో ఉన్నారా? ఈ ఎన్నికలలో మీ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోగలదని భావిస్తున్నారో చెప్పగలరా?” అని ప్రశ్నించినప్పుడు, “ఈ ఎన్నికలలో మేము వ్యూహాత్మకంగా ముందుకు సాగి విజయం సాధిస్తాము,” అని సమాధానం చెప్పడం విశేషం. ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధులున్నారో లేదో, ఉన్నా కనీసం ఎన్ని సీట్లు గెలుచుకోగలమో చెప్పలేకపోతున్న లక్ష్మణ్, టిఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బిజెపియేనాని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 

అందుకే సిఎం కెసిఆర్‌ వారిని ఉద్దేశ్యించి “పాపం గరీబోళ్లు... ఏవో చెప్పుకొంటూ సంతోషపడుతుంటారు. వారి సంతోషాన్ని మనం ఎందుకు పాడుచేయాలి? ఈసారి ఎన్నికలలో వారి స్థానాలను వారు గెలుచుకోగలిగితే అదే గొప్ప విషయం అవుతుంది వాళ్ళకు,” అని అన్నారు. 


Related Post