ఏపీ సిఎం చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్

September 14, 2018


img

నటుడు శివాజీ చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చంద్రబాబుతో పాటు మరో 13 మంది టిడిపి నేతలకు కూడా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్స్ జారీ అయ్యాయి. మహారాష్ట్రలో నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చేసిన పోరాటంలో భాగంగా 2010లో వారందరూ  నిషేధాజ్నలు అమలులో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లారు. అందుకుగాను వారిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులోనే 8 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుతో సహా అందరికీ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్స్ జారీ అయ్యాయి. వారందరినీ ఈ నెల 21వ తేదీన కోర్టులో హాజరు పరచవలసిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. 

నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్స్ జారీ అయినవారిలో ఏపీ నీటిపారుదలశాఖామంత్రి  దేవినేని ఉమా మహేశ్వర రావు, చింతమనేని ప్రభాకర్, నామా నాగేశ్వరరావు, గంగుల కమలాకర్, సి.హెచ్.విజయరామారావు, టి.ప్రకాష్ గౌడ్, హన్మంత్ షిండే, జి.రామానాయుడు, ఏఎస్.రత్నం, ముజఫరుద్దీన్ అన్వరుద్దీన్, పి.అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్, పి.సత్యనారాయణ శింభు, ఎస్. సోమోజు, నక్కా ఆనంద బాబు,  కె.ఎస్.ఎన్.ఎస్.రాజు ఉన్నారు. 

అయితే ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సిఎం స్థాయి వ్యక్తిపై  నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ద్వారా ధర్మాబాద్ కోర్టు అత్యుత్సాహం ప్రదర్శించిందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై టిడిపి నేతలు కూడా మండిపడుతున్నారు. దీని వెనుక ఏదో రాజకీయకుట్ర ఉందని వారు అనుమానిస్తున్నారు. నోటీసు అందినట్లయితే చంద్రబాబు నాయుడు తప్పకుండా కోర్టుకు హాజరవుతారని నారా లోకేశ్ నిన్న చెప్పినప్పటికీ దీనిపై వారు న్యాయనిపుణుల సలహా తీసుకొంటున్నారు. 


Related Post