కాంగ్రెస్‌ తొలి జాబితా రేపు విడుదల?

September 14, 2018


img

తెలంగాణా కాంగ్రెస్‌ ముఖ్య నేతలందరికీ కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో అందరూ డిల్లీ చేరుకొంటున్నారు. ఈరోజు ఉదయం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వారితో సమావేశం అయ్యి అభ్యర్ధుల పేర్లు, పొత్తులు, సీట్లు సర్ధుబాట్లు, ఎన్నికల మ్యానిఫెస్టో, ప్రచార కార్యక్రమాలు మొదలైన అన్ని అంశాలపై చర్చించనున్నారు. 

ఈసారి శాసనసభ ఎన్నికలు వేరేగా జరుగుతున్నాయి కనుక వాటిలో గెలిచినట్లయితే తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికలపై కూడా ఆ ప్రభావం పడుతుంది. కనుక ఈసారి కొంతమంది మాజీ ఎంపీలను శాసనసభ ఎన్నికలలో పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని నమ్ముతున్న పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, వి.హనుమంత రావు, జైపాల్ రెడ్డి వంటివారు కొందరు సీనియర్ నేతలు ఈసారి శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి రాష్ట్ర స్థాయి రాజకీయాలలో చక్రం తిప్పాలనుకొంటున్నట్లు సమాచారం. కనుక ఇవాళ్ళ జరిగే సమావేశంలో ఈ అంశంపై కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకోవచ్చు. 

టిఆర్ఎస్‌ అభ్యర్ధులను ప్రకటించి అప్పుడే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేసింది కానీ పొత్తులు, సీట్ల సర్ధుబాట్లు ప్రక్రియ పూర్తి కానందున కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు తన అభ్యర్ధులను ప్రకటించలేకపోతోంది. కనుక ఈ రెండు అంశాలపై కూడా నేడు తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కానీ ఈ ప్రక్రియ ముగియడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది కనుక ఈలోగా ముఖ్యనేతలతో కూడిన తొలి జాబితాను రేపే విడుదల చేసే అవకాశం ఉంది. 

ఇక రాష్ట్రంలో సోనియా, రాహుల్ గాంధీ, కేంద్ర నాయకుల ఎన్నికల ప్రచార కార్యక్రమాల షెడ్యూల్ కూడా నేడు ఖరారు చేయవచ్చు. కనుక ఇవాళ్ళ డిల్లీలో జరుగబోతున్న ఈ సమావేశం చాలా కీలకమైనదేనని భావించవచ్చు.  


Related Post