అధికార లాంఛనాలతో అటల్‌జీ అంత్యక్రియలు పూర్తి

August 17, 2018


img

భారతరత్న అనే బిరుదుకు పూర్తి సార్ధకత కల్పించిన వ్యక్తి మాజీ ప్రధాని స్వర్గీయ అటల్‌  బిహారీ వాజ్‌పేయి. దశాబ్ధాలపాటు రాజకీయాలలో ఉన్నప్పటికీ ఒక్క శత్రువు కూడా లేని అజాతశత్రువు ఆయన. అందుకే నేడు ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు పార్టీలకు అతీతంగా అనేకమంది నాయకులు తరలివచ్చారు. 

ఈరోజు సాయంత్రం ఆయన డిల్లీలో యమునా నదితీరంలో స్మృతిస్థల్ లో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. హిందూ సంప్రదాయం ప్రకారం  మంత్రోచ్ఛారణల మధ్య ఆయన దత్తపుత్రిక నమిత భట్టాచార్య ఆయన చితికి నిప్పంటించి అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేశారు. ఆమె కుమార్తె, వాజ్ పేయికి ముద్ధుల మనుమరాలు నీహారికకు ఆయనపై కప్పిన త్రివర్ణ పతాకాన్ని అందజేశారు. 

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిద పార్టీల నేతలు, వివిద దేశాల ప్రతినిధులు వాజ్‌పేయి అంత్యక్రియలకు హాజరయ్యి ఆ మహనీయుడికి శ్రద్దాంజలి ఘటించారు.


Related Post